Paytm News: 10 శాతం అప్పర్ సర్క్యూట్ టచ్ చేసిన పేటీఎం.. ఇదీ సంగతి
Circuit filter: భారతీయ ఫిన్ టెక్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన పేటీఎం అత్యంత హీన స్థితికి దిగజారిపోయింది. RBI ఆంక్షలతో మొదలైన పతనం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాని మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు సగానికి పడిపోయింది. తన పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారాన్ని ముగించాల్సి వచ్చింది. నియంత్రణ సంస్థ ఆదేశాలతో అలా చేయక తప్పలేదు.
అయితే అకస్మాత్తుగా ఇవాళ పేటీఎం షేర్లు 10 శాతాన్ని టచ్ చేశాయి. ఇందుకు కారణం లేకపోలేదు. RBI ఆంక్షలతో భారీ కుదుపునకు లోనై.. స్టాక్ విలువ అంతకంతకు పడిపోయింది. ఈ సంక్షోభం నుంచి పెట్టుబడిదారులను గట్టెక్కించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్క్యూట్ ఫిల్టర్ ను అప్పట్లో 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పుడు తిరిగి దాన్ని 10 శాతానికి సవరించడంతో కంపెనీ షేర్లలో మంచి మొమెంటం కనిపించింది.

పేటీఎం షేర్లు ఈరోజు 10 శాతం పెరిగి 381 మార్కును టచ్ చేశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 25 వేల కోట్ల చేరువలోకి ఎగబాకింది. స్టాక్ ధర ఒక నెల గరిష్ఠ స్థాయికి చేరింది. సుమారు 166 కోట్ల విలువైన 45 లక్షలకు పైగా షేర్లు మొదటి సెషన్ లోనే ఈరోజు ట్రేడ్ అయ్యాయి. దీంతో సదరు స్టాక్ లో భారీ ర్యాలీ ఏర్పడింది.
గతేడాది చివరి త్రైమాసికంలో సుమారు 250 కోట్ల లాభాలను పోస్ట్ చేసిన పేటీఎం.. మార్చి 2024 నాటికి 550 కోట్లకుపైగా నష్టాలను చవిచూసింది. RBI ఆంక్షల వల్ల తలెత్తిన సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది. ఇది తాత్కాలికం కాగా రానున్న రోజుల్లో గత వైభవాన్ని తిరిగి పొందుతామని చెబుతోంది. పలు బ్రోకరేజ్ సంస్థలు సైతం స్టాక్ పై అండర్ పర్ఫామెన్స్ రేటింగ్ ఇచ్చాయి.


Click it and Unblock the Notifications