Paytm Q1 Results: దేశీయ ఫిన్‌టెక్ స్టార్టప్ దిగ్గజం పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన క్యూ1 ఫలితాలను ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ కఠిన ఆంక్షల తర్వాత వస్తున్న త్రైమాసిక ఫలితాలపై ప్రస్తుతం ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
జూన్‌తో ముగిసిన మెుదటి త్రైమాసిక కాలానికి కంపెనీ ఏకీకృత నికర నష్టం భారీగా పెరిగి రూ.839 కోట్లుగా నివేదించబడింది. వాస్తవానికి ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.357 కోట్ల కంటే రెండున్నర రెట్లు అధికం. అలాగే గత త్రైమాసికంలో నమోదైన రూ.550 కోట్ల నష్టంతో పోల్చితే ప్రస్తుతం నష్టం 50 శాతం మేర పెరిగింది. ఇదే క్రమంలో కంపెనీ తొలిత్రైమాసికంలో ఆదాయం రూ.1502 కోట్లుగా నివేదించగా.. ఏడాది కిందట ఇదే సమయంలో రూ.2342 కోట్లుగా ఉంది.

మెుత్తం ఆదాయం రూ.1,502 కోట్లలో చెల్లింపుల వ్యాపారం నుంచి రూ.900 కోట్లు, ఆర్థిక సేవల ద్వారా రూ.280 కోట్లు రాగా మిగిలినది మార్కెటింగ్ సేవల ద్వారా కంపెనీ పొందింది. భవిష్యత్తులో GMV, విస్తరిస్తున్న మర్చంట్ బేస్, లోన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో రికవరీ, కాస్ట్ ఆప్టిమైజేషన్‌పై దృష్టి సారించడం వంటి ఆదాయం, లాభదాయకత మెరుగుపడటానికి దోహదపడతాయని పేటీఎం తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. వాస్తవానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ కఠిన చర్యలు కంపెనీ వ్యాపారానికి భారీగా గండికొట్టాయి. ఇది పరోక్షంగా లాభదాయకత, ఆదాయాలను క్షీణింపజేసి నష్టాలను పెంచింది.
అయితే ఒకపక్క కంపెనీ తన నష్టాలు పెరిగినట్లు నివేదించినప్పటికీ పేటీఎం షేర్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. దీనికి అసలు కారణం పేమెంట్స్ దిగ్గజం తన ఉద్యోగుల ఖర్చులను 9 శాతం తగ్గించుకోవటమేనని తెలుస్తోంది. మధ్యాహ్నం 2.48 గంటల సమయంలో పేటీఎం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 4.35 శాతం లాభపడి ఒక్కోటి రూ.465 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. పెరుగుతున్న నష్టాలకు ప్రతిస్పందనగా ఉద్యోగుల ఖర్చులపై ఏటా రూ.400-500 కోట్లను ఆదా చేసేందుకు పేటీఎం దూకుడుగా ముందుకు సాగుతోంది. కొన్ని వన్-టైమ్ ఖర్చుల కారణంగా పరోక్ష ఖర్చులు పెరిగాయని, రానున్న త్రైమాసికాల్లో ఈ ఖర్చులు తగ్గుతాయని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications