Paytm Stock: రిజర్వు బ్యాంక్ అకస్మాత్తు చర్యలతో పేటీఎం స్టాక్ కుప్పకూలిన తర్వాత 5 రోజులకు తిరిగి పుంజుకుంది. నిన్న దాదాపు 5 శాతం పెరిగిన తర్వాత నేడు ఉదయం 10.16 గంటల సమయంలో షేర్ ధర 9.22 శాతం లాభపడి రూ.492.35 వద్ద కొనసాగుతోంది.
సోమవారం ఎన్ఎస్ఈలో పేటీఎం షేర్లు రూ.438.35 వద్ద ముగిశాయి.ఇది బుధవారం ఉదయం రూ.463 ధర వద్ద ప్రారంభమైంది. అయితే కొంత సమయం తర్వాత ఈ షేరు బలమైన పునరాగమనం చేసి ఒక్కో షేరుకు ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.496.25కి చేరుకుంది. వాస్తవానికి ఈ పెరుగుదల వెనుక రెండు పెద్ద అప్‌డేట్‌లు ఉన్నాయి.

ముందుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలు తీసుకోవచ్చని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా దీనిని పూర్తిగా ఖండించటం ఇన్వెస్టర్లలో కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపింది. పేటీఎం కంపెనీ వ్యాపారాలపై ఎలాంటి ఈడీ విచారణ జరగటం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఏదైనా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటే చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం కంపెనీకి అతిపెద్ద ఊరటగా నిలిచింది. అలాగే కంపెనీపై, ఎండీపై ఎలాంటి విచరాణ ప్రస్తుతం జరగటం లేదని పేటీఎం కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక పేటీఎం షేర్లు తిరిగి పుంజుకోవటం వెనుక ఉన్న రెండవ అతిపెద్ద అంశం రిజర్వు బ్యాంక్ చర్యలపై ఎలాంటి చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో పేటీఎం వ్యవస్థాపకులు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ లేకపోవటం పెద్ద విషయం. దీనికి బదులు కంపెనీ ఆర్బీఐతో కలిసి పనిచేసి.. వ్యాపార నిర్వహణలో గుర్తించిన తప్పిదాలను వీలైనంత త్వరగా సరిదిద్దాలని యోచిస్తున్నారు. అందుకే ఆర్బీఐ ఆదేశాలను కోర్టులో సవాలు చేయకూడదని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్ణయించింది.
సెంట్రల్ బ్యాంక్ ప్రశ్నలను లేవనెత్తిన లోపాలను తొలగించాలని నిర్ణయించిన పేటీఎం మేనేజ్‌మెంట్.. తన వాలెట్ వ్యాపారాన్ని అంబానికి చెందిన జియో ఫైనాన్షియల్స్ కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వెల్లడైంది. తమ వాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు ఏ కంపెనీతోనూ చర్చలు జరపడం లేదని ఫిన్‌టెక్ సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications