Paytm Stock: పేటీఎం ఇన్వెస్టర్లకు మరో షాక్.. ఆర్బీఐ దెబ్బకు భారీ నష్టాల్లోకి కంపెనీ..
Paytm Q4 Results: ఇప్పుడిప్పుడు పేటీఎం దెబ్బ నుంచి కోలుకుంటున్న ఇన్వెస్టర్లకు చేదు వార్త ఒకటి వెల్లడైంది. ఈ ఏడాది పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యల తర్వాత కంపెనీ పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నాయి. వాస్తవానికి ఆ పరిస్థితులు ప్రస్తుతం ఆర్థిక పనితీరులో అద్దం పడుతున్నాయి.
తాజాగా కంపెనీ తన మార్చి 2024తో ముగిసిన నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ నష్టాలు భారీగా పెరిగినట్లు వెల్లడైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.169 కోట్లుగా ఉన్న కంపెనీ నికర నష్టం ప్రస్తుత ఏడాది అదే కాలంలో రూ.550 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 3 శాతం క్షీణతను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,334 కోట్ల నుంచి రూ.2,267 కోట్లకు తగ్గాయి.

వాస్తవానికి పేటిఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు, ఇతర బ్యాంకింగ్ భాగస్వాములకు పేటీఎం యూపీఐ సేవల బదలాయింపు ఫలితంగా ఏర్పడిన శాశ్వత అంతరాయం కారణంగా పేటీఎం నాలుగో త్రైమాసికంలో గణనీయమైన వ్యాపార నష్టాన్ని నమోదు చేసింది. అలాగే ESOPలకు ముందు EBITDA మార్చి త్రైమాసికంలో రూ.103 కోట్లకు తగ్గింది. అంతకుముందు సంవత్సరం త్రైమాసికంలో ఇది రూ.234 కోట్లుగా ఉంది. అయితే UPI ప్రోత్సాహకాలను మినహాయించినప్పుడు ESOP కంటే ముందు EBITDA రూ.185 కోట్లుగా నమోదయ్యాయి.
మార్చితో ముగిసిన సమయానికి కంపెనీ చెల్లింపుల వ్యాపార ఆదాయం సంవత్సరానికి 7% వృద్ధిని సాధించింది. ఇది నాలుగో త్రైమాసికంలో రూ.1,568 కోట్లకు చేరుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉత్పత్తులలో అంతరాయాలు, కొన్ని వ్యాపారాల కోసం అవలంబించిన సాంప్రదాయిక విధానం వల్ల తాత్కాలిక ప్రభావంతో ఇది త్రైమాసికానికి 9% క్షీణతను చూసింది. Q4లో అంతరాయాల కారణంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ Q1FY25లో పూర్తి ఆర్థిక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్బీఐ కఠిన చర్యల తర్వాత పేటీఎం వాలెట్, ఫాస్టాగ్ వంటి ఉత్పత్తులపై ప్రభావం కారణంగా వార్షిక ప్రత్యక్ష ప్రభావం EBITDAపై దాదాపు రూ.500 కోట్లుగా ఉంటుందని పేటీఎం సంస్థ అంచనా వేసింది. దీంతో ఉదయం 11.14 గంటల సమయంలో కంపెనీ షేర్లు స్వల్ప నష్టాలతో ఎన్ఎస్ఈలో రూ.350.90 రేటు వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications