Paytm: బిట్‌సిలా స్టార్టప్ ను కొనుగోలు చేయనున్న పేటీఎం..!
ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం స్టాక్ లో శుక్రవారం కూడా ఫాల్ కనిపించింది. ఉదయం 10 గంటల 51 నిమిషాలకు పేటీఎం 7.38 శాతం క్షీణించింది. రూ.413వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో పేటీఎం కొత్త కంపెనీని కొనుగోలు చేయబోతోంది. బెంగుళూరు ఆధారిత ఇ-కామర్స్ స్టార్టప్ అయిన బిట్‌సిలాతో ఈ ఒప్పందం కుదుర్చుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.
పేటీఎం త్వరలో బిట్‌సిలాను కొనుగోలు చేయవచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బిట్‌సిలా అనేది ONDCలో పనిచేస్తున్న ఇంటర్‌ఆపరబుల్ ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ. లావాదేవీల పరంగా బిట్‌సిలా ప్రస్తుతం ONDCలో విక్రేతల తరపున వ్యవహరిస్తున్న మూడవ అతిపెద్ద కంపెనీగా ఉంది. 2020లో దశరథం బిట్ల, సూర్య పోకల్లి కలిసి బిట్‌సిలా స్టార్టప్‌ను ప్రారంభించారు.

ఈ స్టార్టప్ కంపెనీ ఇంతకుముందు అంట్లర్ ఇండియా, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా నుంచి ప్రీ-సీడ్ రౌండ్‌లో నిధులను సేకరించింది. బిట్‌సిలా విక్రేత వైపు యాప్‌ని నడుపుతోంది. బిజినెస్-టు-బిజినెస్ విభాగంలో పనిచేసే కంపెనీ, ONDCలో చిన్న వ్యాపారులకు సహాయం చేస్తుంది.తన బ్యాంకింగ్ యూనిట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పేటీఎం ఈ కొనుగోలు జరిపేందుకు ఉత్సహం కనబరుస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దానిపై అనేక ఆంక్షలు విధించింది కూడా. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని కొత్త కస్టమర్‌లు, క్రెడిట్ బిజినెస్‌ను యాడ్ చేయకుండా RBI వెంటనే నిలిపివేసింది. పేటీఎం షేర్లు కూడా గత కొన్ని రోజులుగా 50 శాతానికి పైగా పడిపోయాయి. ఈ ప్రతిపాదిత ఒప్పందం Paytm తన ఇ-కామర్స్ వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications