Paytm: పేటీఎం నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంకుకు మార్చుకోవచ్చట..!
వ్యాపారి చెల్లింపుల సెటిల్మెంట్ కోసం యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేటీఎం (Paytm) ఫిబ్రవరి 16న తెలిపింది. One97 కమ్యూనికేషన్స్ తన నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్‌తో తెరిచిన ఎస్క్రో ఖాతా ద్వారా మార్చినట్లు కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్‌కి మార్చడం వల్ల మునుపటిలాగా వ్యాపారి సెటిల్‌మెంట్‌లు జరుగుతాయని వన్97 కమ్యూనికేషన్స్ పేర్కొంది.
వన్97 కమ్యూనికేషన్స్ ప్రకారం పేటీఎం, పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్, మాతృ సంస్థ వారి వ్యాపార భాగస్వాములందరికీ సజావుగా పని చేయనున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా మరేదైనా బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ చేయబడిన ఫండ్ లావాదేవీలు కలిగిన వ్యాపారులు అంతరాయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం పేర్కొంది.

పేటీఎం క్యూఆర్ కోడ్ లు, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఇతర చెల్లింపుల బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన పేటీఎం పీఓఎస్ టెర్మినల్ లను ఉపయోగించే వ్యాపారులు మార్చి 15, 2024 తర్వాత కూడా తమ కార్యకలాపాలను సజావుగా కొనసాగించవచ్చని పేటీఎం ప్రకటించింది. ఇంతలోనే ఫాస్టాగ్ కొనుగోలు కోసం నిర్దేశించిన అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించినట్లు
ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌ఎంసీఎల్) తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) మినహా మిగతా 32 అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయ్యొచ్చని పేర్కొంది. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకు టోల్ ద్వారా చాలా డబ్బు వస్తుంది. అందరు ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లిస్తున్నారు. దేశంలో మొత్తం 8 కోట్ల మంది ఫాస్టాగ్ కస్టమర్లు ఉన్నారు. ఈ 8 కోట్లలో పేటీఎం 30 శాతం వాటాను కలిగి ఉంది. ఫాస్టాగ్ నుంచి పేటీఎంను తొలగించడం పెద్ద దెబ్బగానే భావించవచ్చు.
అయినప్పటికీ శుక్రవారం పేటీఎం షేర్లు లాభపడ్డాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. రూ.341 వద్ద ముగిశాయి. ఓ దశలో రూ.318 కనిష్ఠ స్థాయికి వెళ్లి మళ్లీ పుంజుకుంది.


Click it and Unblock the Notifications