Paytm News: మరింత ముదిరిన పేటీఎం సంక్షోభం.. కొత్తగా మరో బిజినెస్ నుంచి అవుట్
Employee Benefit Industry: పేటీఎం సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించడంతో మొదలైన పతనం కొనసాగుతూనే ఉంది. ఇతర అనుబంధ విభాగాలను సైతం ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇప్పటికే భారీగా బిజినెస్ కోల్పోయిన పేటీఎం.. తాజాగా ఇంకో విభాగాన్ని వదులుకోవడానికి సిద్ధమైంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మరియు మొబైల్ వాలెట్‌పై నియంత్రణ సంస్థ ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఇవికాస్తా దాని ఇతర వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల ప్రయోజనాల మార్కెట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ప్లక్సీ (గతంలో సోడెక్సో), జాగ్ల్ మరియు ఇతర బ్యాంకుల అనుబంధ సంస్థలు ఈ రంగంలో తమ ఉనికిని పెంచుకోవడానికి మార్గం సుగమం అయింది.

మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మరియు దాని వాలెట్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల భోజన ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ ఎంపికలను వెతుకుతున్నట్లు ఓ సీనియర్ ఫిన్‌టెక్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఇతర కాంపిటీటర్స్ జాగ్ల్, ప్లక్సీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని ట్యాక్స్ నిబంధనల ప్రకారం పన్ను రహిత భోజన ప్రయోజనాలు అందించడంలో పేటీఎం నిమగ్నమై ఉంది. చాలా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కొంత భాగాన్ని ఇందుకోసం అందిస్తాయి. లావాదేవీల కోసం కార్డ్‌లకు లింక్ చేయబడిన ప్రీపెయిడ్ వాలెట్‌లలోకి నిధులను లోడ్ చేస్తాయి. ఈ కార్డ్‌లు ఆహారం మరియు పానీయాలను విక్రయించే అవుట్‌లెట్‌లలో ఉపయోగించడానికి పరిమితం చేయబడ్డాయి. ఇప్పుడు పేటీఎం పోటీదారులు ఈ విభాగంలో సింహభాగాన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నాయి.


Click it and Unblock the Notifications