Layoffs News: లేఆఫ్స్‌పై పేటీఎం కీలక ప్రకటన.. వదంతులకు చెక్
Paytm News: భారతీయ ఫిన్‌టెక్ రంగంలో పేటీఎం ఓ సంచలనం సృష్టించింది. యూపీఏ సహా పలు డిజిటల్ చెల్లింపులను మారుమూల ప్రాంతాలకు కూడా పరిచయం చేసింది. అయితే నియంత్రణ సంస్థ RB నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించడంతో పరిస్థితి పూర్తిగా తలక్రిందులైంది. రెగ్యులేటర్ ఆదేశాలతో పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇవన్నీ కలిసి కంపెనీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయి. విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సిన అవసరం ఏర్పడింది.
కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు ఉండవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇప్పటికే వెల్లడించింది. అయితే దీనిపై పలు రకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఎంతమంది సిబ్బందిని తొలగిస్తున్నారు అనే సంఖ్య ఎక్కడా ప్రకటించలేదని తేల్చి చెప్పింది. గతంలో ప్రకటన అనంతరం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. మరోసారి లేఆఫ్స్ ఉండకపోవచ్చని తెలిపింది.

'FY24 ఫలితాల సమయంలో ప్రకటించిన విధంగా పూర్తిగా కంపెనీ వృద్ధిపై దృష్టి సారిస్తున్నాం. ఖర్చులు తగ్గించుకుంటూ AI ఇంప్లిమెంటేషన్ ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగుల తొలగింపులను అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా హ్యాండిల్ చేసేందుకు కట్టుబడి ఉన్నాము. పూర్తిస్థాయి నోటీస్ పీరియడ్ సహా పాత బకాయిలు, బోనస్ లు మరియు తొలగింపబడిన ఉద్యోగులకు ప్లేస్‌మెంట్ సపోర్ట్ విషయాల్లో పూర్తిగా సహకరిస్తున్నాం' అని పేటీఎం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కంపెనీ CEO మరియు సహ వ్యవస్థాపకులు విజయ శేఖర్ శర్మ షేర్ హోల్డర్స్‌కు రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధానంగా వ్యాపారంపై దృష్టి సారిస్తున్నామని, ఫిన్‌టెక్ పరిశ్రమలో కస్టమర్ మరియు మర్చంట్ కేర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు AI ద్వారా పలు ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉత్పత్తి మరియు ఖర్చుల ఆదా విషయంలో ఇవి కీలకంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications