Paytm Stock: సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోగానే ముందుగా అందరి చూపు పేటీఎం షేర్లపై పడింది. వాస్తవానికి కంపెనీ షేర్లు మూడు రోజులుగా వరుస పతనాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మెుత్తంగా 42 శాతం మేర పతనమైంది.
పేటీఎం షేర్లలో కొనసాగుతున్న గందరగోళం కారణంగా మెుదటి రెండు రోజులు 20 శాతం చొప్పున షేర్ ధర పతనమైంది. దీంతో రక్షణాత్మక చర్యలు ప్రారంభించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ కంపెనీ షేర్ల పతనానికి సర్క్యూట్ లిమిట్లను 10 శాతానికి కుదించింది. అంటే ఒకే రోజులో స్టాక్ ఈ స్టాయిలో పెరిగినా లేదా తగ్గినా ట్రేడింగ్ నిలిపివేయబడుతుంది. ఈ క్రమంలోనే నేడు పేటీఎం షేర్ 10 శాతం క్షీణించి తన సరికొత్త 52 వారాల కనిష్ఠ ధర రూ.438.50ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.27,850 కోట్లకు తగ్గింది. అయితే ఈ పతనం ఇంకెంత కాలం కొనసాగుతుందనే భయాలు పెట్టుబడిదారులను వేధిస్తున్నాయి.

ఈ గందరగోళంతో పేటీఎం ఉద్యోగుల్లో నెలకొన్న భయాలపై సీఈవో విజయశేఖర శర్మ స్పందించారు. ఏం తప్పు జరిగిందో తనకు తెలియదని.. అయితే తాజా పరిణామాల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ శర్మ హామీ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం కంపెనీ రిజర్వు బ్యాంకుతో కలిసి పనిచేస్తున్నట్లు శర్మ వెల్లడించారు. ఇదే సమయంలో కంపెనీలో ఎలాంటి లేఆఫ్స్ ఉండబోవని.. వ్యాపార భాగస్వామ్యం కోసం పేటీఎం దేశంలోని ప్రముఖ బ్యాంకులతో కలిసి పనిచేస్తోందని వెల్లడించారు.
కంపెనీలోని 800-900 మంది ఉద్యోగులను ఉద్ధేశించి మాట్లాడిన శర్మ కంపెనీలో ఎలాంటి తప్పు దొర్లిందోతమనకు పూర్తిగా తెలియనది.. అయితే అన్ని విషయాలను త్వరలోనే కనుక్కుంటామన్నారు. దాదాపు గంటపాటు ఉద్యోగులతో జరిగిన సమావేశంలో వారి ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించటం పెద్ద ఊరటను కలిగించే అంశంగా మారింది. డిపాజిట్లు తీసుకోవడం, ఫాస్ట్‌ట్యాగ్, క్రెడిట్ లావాదేవీలతో సహా దాదాపు అన్ని ప్రధాన బ్యాంకింగ్ సేవలను అందించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంకును రిజర్వు బ్యాంక్ నియంత్రించిన మూడు రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది.


Click it and Unblock the Notifications