Paytm: ఏపీలో పెట్టుబడులపై Paytm ప్రకటన.. ఈ రంగాల్లో కలిసి వెళ్లనున్నట్లు స్పష్టం
Paytm: తాజాగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అంబానీ, అదానీల దగ్గర నుంచి దిగ్గజ సంస్థల యాజమాన్యం ఇందులో పాల్గొంది. లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు సైతం ముందుకు వచ్చాయి. వాటిలో అధిక శాతం ఇంధన రంగంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసిందే. అయితే మనందరికీ పరిచయమున్న పేటీఎం కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకుఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది.

కుదిరిన ఒప్పందాలు
'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేటీఎం మాతృ సంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్' ప్రకటించింది. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ప్రజారోగ్యం, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక నేరాలను అడ్డుకోవడం వంటి విభాగాల్లో పరస్పర సహకారం కోసం అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్, పేటీఎం CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ శేఖర్ శర్మ దీనిపై సంతకాలు చేసినట్లు స్పష్టం చేసింది.

డిజిటల్ పేమెంట్స్ విస్తరణ
ఈ ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని వీధి వర్తకులు, చిరు వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ ను మరింత విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని పేటీఎం చూస్తోంది. తన రుణ దాతల ద్వారా అవసరం మేరకు వారికి అప్పులు ఇవ్వడానికి సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గవర్నమెంటు సేవలు అందించడానికీ రెడీ అవుతోంది. ప్రభుత్వ శాఖలను డిజిటలీకరించి పౌర సేవలు, వ్యాపారాలను ప్రజల ముందుకు తీసుకురానుంది. టోల్ ప్లాజా వల్ల వద్ద సైతం డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేలా ప్రస్తుత విధానంలో మార్పులు తేవాలని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.

ప్రజారోగ్యంలో విప్లవాత్మక మార్పులు
'యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్(UHI)' ప్రోగ్రాం కింద ప్రజారోగ్యంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పేటీఎం జతకడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ బుకింగ్లను డిజిటల్ గా అందించాలని చూస్తోంది. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఏపీలోని పోలీసులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
రూరల్, నాన్-అర్బన్ ఏరియాల్లో ప్రజలను చైతన్య పరచడానికి ప్రణాళికలు వేసుకుంటోంది. డిజిటల్ ఆర్థికాన్ని ప్రతి మూలకూ తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు పేటియం CEO విజయ శేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ విషయంలో ముందుకు సాగుతామని ప్రకటించారు.


Click it and Unblock the Notifications