Paytm News: పేమెంట్స్ ఫిన్‌టెక్ పేటీఎంకి మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన నాలుగో త్రైమాసిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. వీటిని చూసిన ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది.
నాలుగో త్రైమాసికంలో పేటీఎం రెవెన్యూ 51 శాతం పెరిగి రూ.2,334 కోట్లుగా నమోదైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మెుత్తంగా ఆదాయం 61 శాతం మేర పెరిగి రూ.7,990 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో క్యూ-4లో నష్టాలు భారీగా తగ్గి రూ.168 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నష్టాలు రూ.761 కోట్లుగా నిలిచాయి.

పేటీఎం నష్టాలు క్యూ-3లో రూ.392 కోట్లుగా ఉన్నాయి. స్థూల మర్చండైజ్ విలువ (GMV), అధిక మర్చంట్ సబ్‌స్క్రిప్షన్ రాబడులు, కంపెనీ ప్లాట్‌ఫారమ్ ద్వారా పంపిణీ చేయబడిన రుణాల పెరుగుదల కారణంగా నాలుగో త్రైమాసికంలో ఆదాయ వృద్ధికి దారితీసిందని కంపెనీ వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో స్థూల మర్చండైజ్ విలువ 40 శాతం పెరిగి రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఖర్చులను సైతం కంపెనీ భారీగా తగ్గించుకుంది.
పేమెంట్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పనితీరు మెరుగుపడటం కంపెనీ ఆదాయాలను పెరగటంలో తోడ్పడింది. అలాగే కంపెనీ నికర చెల్లింపుల మార్జిన్ సైతం మంచి పెరుగుదలను నమోదు చేసింది. సౌండ్‌బాక్స్, POS మెషీన్‌ల వంటి చెల్లింపు పరికరాల సబ్‌స్క్రిప్షన్ సేవలు కూడా బలమైన వృద్ధిని సాధించాయి. మార్చి 2023 నాటికి 68 లక్షల మంది వ్యాపారులు Paytm సబ్‌స్క్రిప్షన్‌లను చెల్లించారు.
భారీ అంచనాలు, వాల్యూయేషన్లతో మార్కెట్లోకి వచ్చిన స్టార్టప్ పేటీఎం ఐపీవో ఇన్వెస్టర్లను అప్పట్లో భారీగా నిరాశకు గురిచేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లటంతో కంపెనీ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ ముందుకు సాగుతుంది. రానున్న కొన్ని త్రైమాసికాల్లో కంపెనీ లాభాల బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. ప్రస్తుతం పేటీఎం కంపెనీ షేర్ ధర శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 3 శాతానికి పైగా లాభపడి రూ.691.40 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications