'పతంజలి' ఆయుర్వేద్ పేరు వినగానే ఠక్కున యోగా గురువు బాబా రామ్‌దేవ్ గుర్తుకొస్తారు. అలాగే బాబా రామ్‌దేవ్ అనగానే ఠక్కున 'పతంజలి' స్టోర్లు, దాని ఉత్పత్తులు గుర్తుకొస్తాయి. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకపోవడం, పైగా మార్కెట్‌లో దొరికే ఆయా వస్తువుల ధరల కన్నా తక్కువ ధరకే లభిస్తుండడంతో 'పతంజలి' ఉత్పత్తుల పట్ల జనం మంచి ఆదరణ కనబరిచారు.
దీంతో 2011-17 ఆర్థిక సంవత్సరాల మధ్య పతంజలి గ్రూపు ఆదాయం రూ.10 వేల కోట్లకు పెరిగింది. పతంజలి ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరుగుతూ వచ్చిన ఆదరణ చూశాక.. అప్పటి వరకు మార్కెట్‌లో తిష్టవేసుకుని కూర్చున్న పలు మల్టీ నేషనల్ కంపెనీల కూడా భయపడ్డాయి. అయితే ఈ ఏడాది పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

ఒక వెలుగు వెలిగి, మళ్లీ అంతలోనే...
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణల అధీనంలో స్థాపితమైన పతంజలి గ్రూపు ఆ మధ్యన ఒక వెలుగు వెలిగింది. జనం కూడా పతంజలి బ్రాండ్ ఉత్పత్తుల పట్ల మంచి ఆదరణ కనబరిచారు. ఇది తయారు చేసే టూత్‌పేస్టు, సబ్బులు, తేనె, పిండి, నెయ్యికి గిరాకీ బాగా ఉండేది. చాలామంది రిటైలర్లు తమ దుకాణాలలో పతంజలి ఉత్పత్తులు ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించే వారు. అయితే రానురాను పరిస్థితి మారుతోంది. పతంజలి బ్రాండ్ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది.

తగ్గుతూ వస్తోన్న ఆదాయం...
2011-17 ఆర్థిక సంవత్సరాల్లో చూస్తే పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ ఆదాయం రూ.10 వేల కోట్లు దాటింది. 2017లో ఈ సంస్థ ఆదాయం రూ.10,561 కోట్లు. అయితే 2018లో మాత్రం ఈ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. కేవలం రూ.8,135 కోట్ల ఆదాయం మాత్రమే ఆ ఏడాది వచ్చింది. ఆ తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ గ్రూపు ఆదాయం 2.38 శాతం మాత్రమే పెరిగి రూ.8,330 కోట్లుగా నమోదైంది. 2017 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే గత రెండేళ్లలో ఈ సంస్థ ఆదాయం తగ్గిందనే చెప్పొచ్చు.

జనాదరణ తగ్గడంతో...
జనం కూడా పతంజలి ఉత్పత్తుల పట్ల కొత్తలో చూపించినంత ఆదరణ ఇప్పుడు కనబరచడం లేదు. ఫలితంగా అమ్మకాలు గణనీయంగా తగ్గి ఆ ప్రభావం సంస్థ ఆదాయంపై పడుతోంది. దీంతో ఏటా పతంజలి ఆదాయం తగ్గుతోంది. ఒకప్పుడు హిందుస్థాన్ యూనీలివర్, డాబర్, ఐటీసీ వంటి కంపెనీలను సైతం వణికించిన పతంజలి ఇప్పుడు వాటితో పోటీ పడలేకపోతోంది. పతంజలి మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ‘దంతకాంతి' టూత్‌పేస్ట్‌కు ప్రజల్లో అమితాదరణ లభించడంతో మిగిలిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా తప్పనిసరై ఆయుర్వేద టూత్‌పేస్టులను తయారుచేయాల్సి వచ్చింది. అయితే ఈ ఉత్పత్తుల నాణ్యతపై ఆ మధ్య పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి.

రిటైలర్లు ఏమంటున్నారంటే...
పతంజలి ఉత్పత్తులకు ఒకప్పుడు ఉన్నంత గిరాకీ ఇప్పుడు కనిపించడం లేదనేది రిటైలర్లు చెబుతున్న మాట. ఏవో రెండు మూడు ఉత్పత్తులు తప్ప మిగతావి పెద్దగా అమ్ముడుపోవడం లేదని వారు పేర్కొంటున్నారు. పతంజలి ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు కూడా క్రమంగా మూతపడుతుండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరో విషయం ఏమిటంటే.. పతంజలి ఉత్పత్తుల సరఫరాలో విపరీత జాప్యం చోటుచేసుకోవడం. మార్కెట్‌లో స్టాక్ అయిపోయిన వెంటనే తిరిగి స్టాక్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో కంపెనీ విఫలమవుతోందని, దీంతో వినియోగదారులు ఆ ఉత్పత్తులకు బదులు ఇతర కంపెనీల ఉత్పత్తులు తీసుకువెళుతున్నారని ఓ రిటైల్ చైన్ మేనేజర్ వెల్లడించారు.

‘‘నోట్ల రద్దు, జీఎస్టీ కూడా కారణాలే..’’
అయితే పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు క్షీణించడానికి, సంస్థ ఆదాయం పడిపోతుండడానికి నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి కూడా కారణాలేనని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ విమర్శిస్తున్నారు. అంతేకాక, బాబా రామ్‌దేవ్ ప్రభావానికి లోనైన వారు మాత్రమే తమ సంస్థ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారని, అలా కాకుండా ఇతర వినియోగదారులు కూడా తమ ఉత్పత్తులు కొనేలా చేయాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తమ సప్లై చెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సి ఉందని, లేకపోతే గ్రోత్ టార్గెట్స్‌ను చేరుకోలేమని అంగీకరించారు.


Click it and Unblock the Notifications