రద్దైన టికెట్‌పై రూ. 5 తక్కువ రీఫండ్.. ప్రయాణికుడికి రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..
రద్దు చేయబడిన రైలు టిక్కెట్టుపై రావలసిన మొత్తం కంటే కేవలం రూ. 5 తక్కువగా వాపసు చేసినందుకు లుధియానా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ భారతీయ రైల్వేను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సేవా లోపానికి గాను బాధితుడికి ఆ రూ. 5 బకాయిని తిరిగి ఇవ్వడంతో పాటు, మానసిక వేదనకు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. కమిషన్ అధ్యక్షుడు సంజీవ్ బాత్రా, సభ్యురాలు మోనికా భగత్‌లతో కూడిన ధర్మాసనం ఈ అన్యాయమైన వాణిజ్య పద్ధతి వల్ల ఫిర్యాదుదారుడు తీవ్ర మానసిక క్షోభకు, వేధింపులకు గురయ్యాడని జూన్ 2 నాటి తన ఉత్తర్వులో స్పష్టం చేసింది.
ఈ వివాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు ఫిబ్రవరి 28, 2023న తన కోసం, తన తండ్రి కోసం హిసార్ నుండి లుధియానాకు వెళ్లడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డ్ ద్వారా రూ. 330 చెల్లించి రెండు రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నాడు. అయితే అత్యవసర కారణాల వల్ల ప్రయాణానికి ఒక రోజు ముందు ఆ టిక్కెట్లను రద్దు చేసుకోగా, నిబంధనల ప్రకారం రద్దు ఛార్జీల కింద రూ. 240 మినహాయించుకుని అతనికి రూ. 90 వాపసు ఇవ్వాల్సి ఉంది. కానీ అతని బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 85 మాత్రమే జమ అయ్యాయి. ఈ రూ. 5 తక్కువ రావడంపై రైల్వే అధికారులు, హెల్ప్‌లైన్ సేవల నుండి ఎలాంటి సరైన వివరణ లభించకపోవడంతో.. బాధితుడు న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

విచారణ సమయంలో రైల్వే శాఖ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఆ రూ. 5 కోత విధించింది తాము కాదని, ఫిర్యాదుదారుడి బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాయే రీఫండ్ ఫీజుగా ఆ మొత్తాన్ని వసూలు చేసిందని పేర్కొంది. ఇందుకోసం డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే రీఫండ్‌లపై రూ. 5 వసూలు చేయడానికి ఎస్‌బిఐకి అనుమతినిస్తూ 2017లో రైల్వే బోర్డు జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌ను కూడా వారు కోర్టుకు సమర్పించారు. అలాగే ఫిర్యాదుదారుడు తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా నేరుగా కేసు వేశాడని రైల్వే తరఫు న్యాయవాదులు వాదించారు.
అయితే రైల్వేల వాదనను వినియోగదారుల కమిషన్ పూర్తిగా తిరస్కరించింది. రద్దు చేయబడిన టిక్కెట్టుపై ఎక్కడా ఇటువంటి అదనపు వాపసు రుసుము గురించి ప్రస్తావించలేదని కమిషన్ గమనించింది. రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం ఇలాంటి మినహాయింపుల సమాచారాన్ని రైల్వే స్టేషన్‌లలోని పీఓఎస్ (POS) మిషన్లు ఉండే బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులకు కనిపించేలా ప్రముఖంగా ప్రదర్శించాల్సి ఉండగా, రైల్వే శాఖ ఆ పని చేసినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కమిషన్ నిలదీసింది. అంతెందుకు, స్వయంగా లుధియానా స్టేషన్ మాస్టర్, డివిజనల్ మేనేజర్ వంటి సీనియర్ అధికారులకే రైల్వే-ఎస్‌బీఐ మధ్య ఉన్న ఈ ఒప్పందం గురించి తెలియదనే విషయాన్ని కమిషన్ ఎత్తిచూపింది.
ఖాతాదారుడికి ముందే సమాచారం ఇవ్వకుండా, కనీసం అతని వాదన వినకుండానే ఏకపక్షంగా డబ్బులు మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు (Principles of Natural Justice) విరుద్ధమని కమిషన్ వ్యాఖ్యానించింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వినియోగదారునికి ఉన్న 'సమాచారం పొందే హక్కు'ను ఇక్కడ రైల్వేలు పూర్తిగా ఉల్లంఘించాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే బాధితుడి ఫిర్యాదును పాక్షికంగా అనుమతిస్తూ, మినహాయించిన రూ. 5తో పాటు రూ. 10,000 జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే, ఆపై చెల్లింపు పూర్తి చేసే వరకు రోజుకు రూ. 200 చొప్పున అదనపు జరిమానా విధించబడుతుందని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది.


Click it and Unblock the Notifications
