Indigo crew behaviour: దేశీయ విమానయాన రంగం ఎన్నడూలేని విధంగా వృద్ధి బాటలో పయనిస్తోంది. ఆయా ప్లేయర్స్ తమ ఫ్లీట్‌ను పెంచుకునేందుకు, కొత్త రూట్లలో ఆపరేట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఫ్లైట్‌లో సిబ్బంది ప్రయాణీకులతో ప్రవర్తిస్తున్న తీరుపై అడపాదడపా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి వివిధ పతకాలను గెలుచుకున్న సువర్ణ రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి తన ప్రయాణంలో ఇండిగో సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. పదేపదే అభ్యర్థించినా సహాయం అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు తెలిపారు.

విమానం డోర్ వద్ద క్రీడాకారిణి వ్యక్తిగత వీల్‌ఛైర్‌ను కోరడంతో వివాదం తలెత్తింది. విమాన సిబ్బంది తన అవసరాల పట్ల ఉదాసీనత చూపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇది మొదటిసారి కాదని, దివ్యాంగుల పట్ల ఎయిర్ లైన్స్ పదేపదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఫైర్ అయ్యారు.
'ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ వద్ద నా పర్సనల్ వీల్‌చైర్ కావాలని 10 సార్లు చెప్పాను. కానీ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. అక్కడ వీల్‌చైర్ అందించే పాలసీ ఉన్నట్లు ముగ్గురు మేనేజర్‌లు నిన్న స్పష్టం చేశారు. అలాంటప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? సిబ్బంది ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 లక్షల విలువైన తన వ్యక్తిగత వీల్ చైర్ ను ఎయిర్‌లైన్ సిబ్బంధి ధ్వంసం చేశారని, ఇండిగో దానికి బాధ్యత వహించి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరారు.
కొరియాలో జరిగిన 2014 ఆసియా పారా గేమ్స్ లో సువర్ణ రెండు పతకాలు సాధించారు. ఇక 2013లో థాయ్ లాండ్ లో నిర్వహించిన పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్‌లోనూ రెండు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ తరహా వ్యక్తులకే ఇలాంటి అనుభవం ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications