పాన్-ఆధార్ లింకింగ్ తేదీ పొడిగింపు: ఫామ్ 16 సహా వీటి గడువు కూడా...
పాన్ కార్డు - ఆధార్ కార్డును అనుసంధానం చేయలేదా? అయితే మీకు ఓ ఊరట న్యూస్. పాన్-ఆధార్ కార్డు అనుసంధాన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గడువును సెప్టెంబర్ చివరి వరకు పొడిగించింది. తాజా గడువు సెప్టెంబర్ 30. గతంలో విధించిన గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తున్నందున కేంద్రం ఈ ప్రకటన చేసింది.
పాన్-ఆధార్‌కు 2020 మార్చి 31వ తేదీ వరకు తొలుత గడువు విధించారు. కరోనా నేపథ్యంలో ఆ తర్వాత 2020 జూన్ 30వ తేదీకి, ఆ తర్వాత 2021 మార్చి 31వ తేదీకి, క్రితంసారి ఈ ఏడాది జూన్ 30వ తేదీకి గడువును పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.

పాన్-ఆధార్‌తో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఉద్యోగి కరోనా చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే, కరోనాతో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికీ ఈ మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో 2 నెలలు పొడిగించింది. అంటే ఈ డెడ్ లైన్ ఆగస్ట్ 31. ఫామ్ 16 గడువును జులై 15వ తేదీ నుండి జులై 31 వరకు పొడిగించింది.