Palm Oil: పామాయిల్ ధరలు ఈ నెలలో దాదాపు ఐదవ వంతు వరకు పెరిగాయి. అయితే ఇప్పటికీ మార్చిలోని ఆల్ టైమ్ హై ధరల కంటే చాలా దిగువన ట్రేడవుతున్నాయి. ఇండోనేషియా, మలేషియాలలో నిల్వలను తగ్గించుకోవటం వల్ల ధరలు కొంత అందుబాటులోకి వచ్చాయి.

మళ్లీ ధరల పెరుగుదల..
ప్రస్తుతం పామాయిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో అధిక వర్షాలు ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. దీంతో పామాయిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీనిని ఆహార అవసరాలతో పాటు బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో వినియోగించటం వల్ల డిమాండ్ పెరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్ కు టన్ను పామాయిల్ దిగుమతికి 976 డాలర్లు ఖర్చవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఇండోనేషియా నిర్ణయం..
ఇండోనేషియా ఎగుమతి సుంకాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకుంటే ధర టన్నుకు 1,100 డాలర్లకు చేరుకుంటుందని ముంబైకి చెందిన డీలర్ తెలిపారు. ప్రస్తుతం పామాయిల్, సోయాబీన్ ధరల మధ్య వత్యాసం చాలా ఎక్కువగా ఉందని ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్స్ తయారీ దారు జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి అన్నారు. సాధారణంగానే నవంబర్ మాసంలో ఇండోనేషియా, మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్..
ప్రపంచంలోని 76% సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి నల్ల సముద్రం(Black Sea) మార్గం ద్వారా జరుగుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇక్కడ కొన్ని అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడినా.. దాని వల్ల పామాయిల్ డిమాండ్ పెరుగుతుందని బ్రోకర్ సన్‌విన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ బజోరియా చెప్పారు. ఆగస్ట్‌లో UN-బ్రోకర్డ్ ఒప్పందం ప్రకారం నల్ల సముద్రం ప్రాంతం నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులు తిరిగి ప్రారంభం కావటంతో ధరలు తగ్గటం ప్రారంభమయ్యాయి.

డిసెంబర్ తర్వాత..
డిసెంబరు తర్వాత ఇండోనేషియా ఎగుమతి పన్నులపై మినహాయింపును కొనసాగించకపోవచ్చని ట్రేడర్లు చెబుతున్నారు. ఇప్పటికే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్న వేళ.. ఇండోనేషియా పన్నులు పామాయిల్‌ను మరింత ఖరీదైనదిగా మార్చుతుందని ఢిల్లీకి చెందిన డీలర్ చెబుతున్నారు. దేశీయ రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు భారత ప్రభుత్వం త్వరలో పామాయిల్ పై దిగుమతి సుంఖాన్ని పెంచుతుందని కొన్ని ఊహాగానాలతో కథనాలు వస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. ఇదే జరిగితే సామాన్యులతో పాటు హోటల్ వ్యాపారులపై ధరల భారం పెరగుతుంది.


Click it and Unblock the Notifications