Pakistan Stock Exchange: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల చూపు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపైనే ఉంది. గడచిన ఐదు రోజులుగా కరాచీ మార్కెట్లలో కొనసాగుతున్న బుల్స్ జోరు చారిత్రాత్మక రికార్డును సృష్టించింది.
పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. శుక్రవారం భారతీయ స్టాక్‌లు డౌన్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే గడచిన 5 రోజులుగా దాయాది దేశంలో స్టాక్ మార్కెట్లలో డబ్బుల వర్షం కురుస్తోంది. ఈ కాలంలో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ దాదాపు 10 శాతానికి పైగా లాభపడింది. కేఎస్ఈ సూచీ తొలిసారిగా 80,000 మార్కును అధిగమించి 80,059.87 పాయింట్లకు చేరుకుంది. పెట్టుబడిదారులు పాకిస్తాన్‌లో ఆర్థిక పునరుద్ధరణ సంకేతాలను చూడటమే ఈ పెరుగుదలకు కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకపక్క పాక్ ఆర్థిక లోటు తగ్గుతుండగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకోవచ్చనే సంకేతాలు మార్కెట్లను బుల్ జోరులో కొనసాగటానికి ఊతం ఇస్తున్నాయి. శుక్రవారం నాడు కేఎస్ఈ సూచీ 79,664.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం కేఎస్ఈ 441 పాయింట్లు లాభపడి 79,243.03 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో సైతం కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ దూకుడు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం బలమైన ఆర్థిక దృక్పథం కారణంగా అక్కడి స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్థిక లోటు తగ్గటంతో పాటు.. IMFతో ఒప్పందం ఆశాజనకంగా ఉందని ఫిచ్ అంచనాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నట్లు నివేదికలు చెబుతన్నాయి. ఈ క్రమంలో పాక్ కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.3 శాతానికి తగ్గింది. అలాగే ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్లాన్స్ తమ ఆదాయాలను పెంచుతాయని ఇన్వెస్టర్లు ఆశాభావంతో ఉన్నారు. దీంతో స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ వాతావరణం నెలకొంది.
శుక్రవారం భారత మార్కెట్లు పతనం:
పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నిరంతర పెరుగుదలతో దూసుకుపోతుండగా.. భారత స్టాక్ మార్కెట్లు మాత్రం డీలా పడ్డాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి కీలక బెంచ్ మార్క్ సూచీలు పతనంతో చతికిలపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 269 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications