Pakistan: ఓపెనింగ్ రోజే షాపింగ్ మాల్ క్లోజ్.. ఊహించని చేదు అనుభవం.. పాకిస్థాన్ పరువు పాయే..
Pak shopping mall: పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. వరల్డ్ బ్యాంక్ సాయం కోసం మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలపై భారీ పన్నులు సహా పలు సబ్సిడీలకు మంగళం పాడితేనే రుణం మంజూరు చేస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిదులు ఇటీవల తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు చేస్తున్న పనులు యావత్ దేశాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి.
'డ్రీమ్ బజార్' పేరిట పాకిస్థాన్‌లో ఓ షాపింగ్ మాల్ వెలిసింది. దీని గురించి నిర్వాహకులు ముందే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ప్రారంభోత్సవం రోజు పెద్ద గందరగోళం నెలకొంది. ప్రజలు గుంపులు గుంపులుగా షాపింగ్ మాల్‌పై దాడి చేసి 30 నిమిషాల్లోనే దాన్ని మొత్తం ఖాళీ చేసేశారు. ఇదే సమయంలో మాల్ ఆస్తిలో సింహ భాగాన్ని నాశనం చేశారు. ఈ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మెరుగైన ఉత్పత్తులను లూటీ చేసేందుకు ఒకరినొకరు నెట్టుకోవడం, తోసుకోవడం వంటివి చేస్తూ భీతావహ వాతావరణం సృష్టించారు. నేలపై బట్టలను పరిచి వాటిలో కావాల్సిన వస్తువులను తీసుకెళ్లారు. ఉద్యోగులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. భారీ సమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు జోక్యం చేసుకోలేదని, వారిని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేశారని తెలుస్తోంది.
కరాచీలో నెలకొల్పిన ఈ 'డ్రీమ్ బజార్' పాకిస్థాన్‌లోని అతిపెద్ద పొదుపు దుకాణంగా పెద్దఎత్తున ప్రచారం చేయబడింది. డిజైనర్ దుస్తులు, గృహోపకరణాలు సహా పలు ఉత్పత్తులపై నమ్మశక్యం కాని డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు వాగ్దానం చేసింది. స్టాక్ ఉండగానే తక్కువ ధరకే వివిధ వస్తువులు సొంతం చేసుకోవాలనే తపనతో కరాచీ వాసులు వేలాది మంది షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజున తరలివచ్చారు.
ఈ డిజాస్టర్ తర్వాత షాపింగ్ మాల్ ను నిరవధికంగా మూసివేయవలసి వచ్చింది. 'డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవ దినాన్ని విజయవంతం చేసినందుకు కరాచీ నివాసితులకు కృతజ్ఞతలు. ప్రస్తుతం మాల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని రీ-సెట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి, మేము త్వరలోనే తిరిగి వస్తాము' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విదేశాల్లో ఉన్న పాకిస్థానీ వ్యాపారవేత్త ఈ మాల్‌ను నిర్మించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications