Pakistan Crisis: దాయాది దేశం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నేతలు మారుతున్న అక్కడి ప్రజల తలరాతలు మాత్రం మారట్లేదు. గత కొంత కాలంగా సంక్షోభంలో కూరుకుపోయిన పాక్.. విదేశీ మారక నిల్వల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. గరిష్ఠ ద్రవ్యోల్బణంతో పాటు డీజిల్-పెట్రోల్ రికార్డు ధరలకు చేరుకున్నాయి. గంటల కొద్దీ కరెంటు కోతలు.. ఇలా అనేక సమస్యలు ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి.

IMF నుంచి అప్పు కోసం..
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో IMF నుంచి డబ్బు పొందడానికి 4 బిలియన్ డాలర్లు సేకరించాలని పాకిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు పాక్ ఇప్పుడు ప్రభుత్వ కంపెనీల వాటాలను ఇతర దేశాలకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది.

IMF ఒప్పందానికి ఈ చర్యలు అవసరం..
ప్రభుత్వ కంపెనీల కార్పొరేట్ గవర్నెన్స్‌పై సెమినార్‌లో ప్రసంగిస్తూ పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ఈ విషయాన్ని ప్రకటించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరానికి 4 బిలియన్ డాలర్ల ఫైనాన్స్ గ్యాప్‌ను పూరించాల్సిందిగా IMF కోరిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం.. లిస్టెడ్ కంపెనీల షేర్లను స్నేహపూర్వక దేశాలకు విక్రయించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తోంది. ఈ షేర్లను పాకిస్తాన్ తర్వాత తిరిగి కొనుగోలు చేసే షరతుతో విక్రయించనుంది.

చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం..
మరికొద్ది వారాల్లో దిగుమతులపై నిషేధం ఎత్తివేస్తామని పాక్ ఆర్థిక మంత్రి తెలిపారు. IMFతో సిబ్బంది స్థాయిలో ఒప్పందంలో అంగీకరించిన అన్ని చర్యలను ఇప్పటికే తీసుకున్నారు. ఆగస్టులో IMF నుంచి మొదటి విడత నిధులను పొందడంలో ఇప్పుడు ఎటువంటి అడ్డంకి లేదని తెలుస్తోంది. ఇంటర్-గవర్నమెంట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ యాక్ట్- 2022కి బుధవారం తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపిందని డాన్ వార్తల్లో పేర్కొంది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జీ2జీ) ప్రాతిపదికన ఇటువంటి వాణిజ్య లావాదేవీలు జరపేందుకు నిబంధన లేనందున చట్టంలో సవరణ తప్పనిసరి అని ఆయన వెల్లడించారు.

చట్టం మార్పుతో పెట్టుబడులు..
బుధవారం క్యాబినెట్ సమావేశం అనంతరం లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన 'ఇంటర్-గవర్నమెంట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ యాక్ట్- 2022'కి ఆమోదం తెలిపినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పుడు బిల్లు సంబంధిత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపబడింది. ఈ చట్టం వల్ల విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతుందని మంత్రివర్గానికి తెలిపారు. ఇది కాకుండా.. అభివృద్ధి ఒప్పందంలో గవర్నమెంట్ టూ గనర్నమెంట్ ప్రాతిపదికన విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతాయని వారు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications