Pakistan: పీకల్లోతు కష్టాల్లో పాకిస్థాన్.. అక్కడి నెలమొత్తం సేల్స్ ఇండియాలో గంటల్లోనే..
Car sales: పొరుగుదేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్ర ద్రవ్యోల్బణంతో విలవిల్లాడుతోంది. ప్రతి విషయంలోనూ భారత్ తో పోటీపడే దాయాది దేశంలో గతనెల కార్ సేల్స్ మరింత దిగజారిపోయాయి. పాక్ లో నెలకొన్న గడ్డు స్థితిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నవంబర్ నెల మొత్తంలో పాకిస్థాన్ లో కార్ల విక్రయాలు 5 వేల మార్కును దాటడం చాలా కష్టమైపోయింది. ఇదే సమయంలో భారత్ సగం రోజుల్లోనే ఆ సంఖ్య కంటే ఎక్కువ కార్లను అమ్మింది. సుజుకీ, ఇండస్ మోటార్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీ సంస్థల విక్రయాలు వరుసగా 72, 71 మరియు 49 శాతం చొప్పున క్షీణించాయి.

అమ్మకాలు భారీగా పడిపోవడంతో టయోటా, సుజుకీ మరియు హోండాతో సహా అనేక కార్ల తయారీదారులు గత నెలలో తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు.ఇక ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్య పాక్ లో మొత్తం 20 వేల 871 కార్లు అమ్ముడయ్యాయి. వీటితో పాటు మోటార్‌సైకిళ్లు మరియు మూడు చక్రాల వాహనాల పరిస్థితి కూడా దాదాపు ఇదే రకంగా ఉంది.
పాకిస్థాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం నవంబర్ 2023లో 4 వేల 875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 15 వేల 432 కార్లను స్థానిక డీలర్లు విక్రయించారు. ఇక భారత్ విషయానికి వస్తే, గత నెలలో 3.60 లక్షల కార్ల విక్రయాలు నమోదయ్యాయి. అంటే పాక్ నెల మొత్తం విక్రయాలు ఇండియాలో కేవలం 12 గంటల్లోనే జరిగాయన్నమాట.
దేశంలోని ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న కార్ల ధరలు, కొనుగోలు శక్తి మందగించడం వంటి అనేక అంశాలు ఈ క్షీణతకు కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు మరియు ఖరీదైన ఆటో ఫైనాన్సింగ్ కారణంగా పెరిగిన ధరలతో పాక్ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం పోరాడుతోంది.


Click it and Unblock the Notifications