ప్యాకేజీ ఉత్పత్తుల విక్రయ ధర, MRP నిబంధనల్లో మార్పులివే
ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు ఆ ఉత్పత్తి పైన బరువు, మాగ్జిమం రిటైల్ ప్రైస్ ఉంటుంది. బిస్కట్ ప్యాకెట్, సబ్బులు, పేస్టుల బరువు 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు అని ముద్రిస్తారు. అలాగే, ఆ ఉత్పత్తి పైన గరిష్ట చిల్లర ధర ఉంటుంది. దీంతో ఇతర కంపెనీకి చెందిన అదే రకం ఉత్పత్తి ధరతో పోల్చడానికి వీల్లేకుండా పోతుంది. ఎందుకంటే యూనిట్‌కు ఎంత ధర అని ముద్రించి ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఉత్పత్తుల విక్రయంలో వివిధ కంపెనీల మధ్య ఏకరూపత ఉండేలా, తద్వారా కస్టమర్లు ధరలను పోల్చుకునే సౌకర్యాన్ని తీసుకు వస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ధరలను పోల్చుకోవడం కస్టమర్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కంపెనీలు వ్యూహాత్మకంగా నిత్యావసర ప్యాకేజీ ఉత్పత్తులపై అంకెల ట్రిక్స్ ఉపయోగిస్తాయి. అయితే తాజాగా ప్రభుత్వం ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు యూనిట్ విక్రయ ధర ఎంతో తెలపాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ ఉత్పత్తులు) నిబంధనలు 2011ను సవరించింది. ఇవి ఏప్రిల్ నుండి అమలులోకి రానున్నాయి.

ఏం ముద్రించాలి?
కిలోకు మించిన బరువుతో ఉండే ఉత్పత్తి ప్యాకెట్ల పైన MRPతో పాటు ఒక కిలో ధర ఎంత అన్నది ముద్రించాలి. కిలో కంటే తక్కువ బరువుతో ఉండే ఉత్పత్తులపై MRPతో పాటు ఒక గ్రాము ధర ఎంత అన్నది ముద్రించాలి.
కంపెనీలు 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, ఒక కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5 కిలోల పరిమాణాల్లో పందొమ్మిది రకాల కమోడిటీలను విక్రయించాలని షెడ్యూల్ 2 నిర్దేశిస్తోంది. వీటికి భిన్న పరిమాణాల్లో విక్రయించాలంటే అనుమతి తీసుకోవాలి. దీంతో అన్ని కంపెనీలు అనుమతులు పొందడం లేదని గుర్తించడంతో కంపెనీలకు స్వేచ్ఛను ఇచ్చే ఉద్దేశ్యంతో షెడ్యూల్ 2ను రద్దు చేస్తూ సవరణను తీసుకు వచ్చారు.

తయారీ తేది తప్పనిసరి
ప్రస్తుతం ఉత్పత్తులపై MRPని పైసలతో పాటు పేర్కొనాల్సి ఉంది. ఇక నుండి రూపాయల్లో పేర్కొంటే సరిపోతుందని నిబంధనలు తీసుకువచ్చారు. అలాగే, ప్యాకెట్ల పైన నెంబర్లలో లేదా యూనిట్‌లో పరిమాణాన్ని పేర్కొంటే సరిపోతుంది. లేదా ఎన్ని పీసులు, ఎన్ని సెట్లు ఉన్నాయో కూడా పేర్కొనవచ్చు. దిగుమతి చేసుకునే కమోడిటీలపై ప్రస్తుతం కంపెనీలు దిగుమతి తేదీ లేదా తయారీ తేదీ లేదా తిరిగి ప్యాకేజీ చేసిన తేదీని పేర్కొనే ఆప్షన్ కలిగి ఉన్నాయి. దీని స్థానంలో ఇక నుండి తయారీ తేదీని తెలియజేయాలి. కస్టమర్లకు తయారీ తేదీ ఒక్కటే ప్రామాణికం కనుక ఈ మార్పును తీసుకు వచ్చారు.

ఈ నిబంధనల్లో మార్పు
బియ్యం లేదా గోధుమపిండిని 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, 1 కిలో, 1.25 కిలో, 1.5 కిలో, 1.75 కిలో, 2 కిలోలు, 5 కిలోలు ఆ తర్వాత ఐదు గుణింతాల్లో ప్యాక్ చేయాలి. వివిధ పరిమాణాల్లో వీటిని విక్రయించడానికి అనుమతించాలని పరిశ్రమ గతంలో కోరింది. అయితే కొన్నింటికి మాత్రమే అనుమతులు వచ్చాయి. మరికొన్నింటికి రాలేదు. కంపెనీల సౌలభ్యం కోసం తాజాగా షెడ్యూల్ 2లోని నిబంధనలను రద్దు చేసి, యూనిట్ విక్రయ ధర అంశాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
MRPని కంపెనీలు తమకు ఇష్టమైన రూపంలో ముద్రించుకోవచ్చు. కంపెనీలు ప్యాకేజీలో ఉన్న వస్తువుల సంఖ్యను ఇప్పటి వరకు నిర్దిష్ట రూపంలో ముద్రించాలి. దీనిని ఇప్పుడు రద్దు చేశారు. దిగుమతి లేదా తయారీ లేదా ప్రీ-ప్యాకేజింగ్ తేదీల్లో ఏది ముద్రించుకోవాలనే అంశాన్ని ఇప్పటి వరకు కంపెనీలకు వదిలివేయగా, ఇకపై తయారీ తేదీని మాత్రమే ముద్రించాలి.


Click it and Unblock the Notifications