హాస్పిటాలిటీ యూనీకార్న్ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. క్రమంగా ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందిస్తామని వెల్లడించింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో, ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఆయా రంగాల్లో చాలా కంపెనీలు 5 శాతం నుండి 30 శాతం అంతకంటే ఎక్కువ కోత విధించాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆతిథ్య రంగం భారీగా దెబ్బతిన్నది. దీంతో ఓయో హోటల్స్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.

రూ.8 లక్షల లోపు శాలరీ ఉంటే పూర్తి వేతనం
భారత్, దక్షిణ ఆసియాలోని తమ ఉద్యోగులకు ఆగస్ట్ నుండి పూర్తిస్థాయి వేతనం ఇవ్వనున్నట్లు ఓయో ప్రకటించింది. రూ.8 లక్షల వరకు వార్షిక వేతనం ఉన్న వారికి, ఆగస్ట్ 1వ తేదీ నుండి శాలరీలో ఎలాంటి కోత లేకుండా చెల్లిస్తామని తెలిపింది. మిగిలిన వారికి దశల వారీగా 2020 అక్టోబర్ నుండి క్రమంగా పూర్తి వేతనం చెల్లిస్తామని వెల్లడించింది. కరోనా కారణంగా మే నెల నుండి 4 నెలల పాటు కొంతమంది ఉద్యోగులను సెలవులపై పంపించింది. ఈ మేరకు ఏప్రిల్ 22న వారిని కోరింది. ఏప్రిల్-జూలై నెలలకు ఉద్యోగులకు 25 శాతం వేతన కోత ప్రకటించింది.

రూ.8 లక్షల కంటే పైన శాలరీ ఉంటే..
దక్షిణాసియా, ఇండియాలో ఓయో వర్క్ ఫోర్స్ దాదాపు 60 శాతం ఉంటుంది. రూ.8 లక్షల కంటే ఎక్కువ వేతనం కలిగిన ఉద్యోగులకు అక్టోబర్ నుండి.. కోత విధించిన 25 శాతంలో 12.5 శాతం పెంచుతారు. మిగతా 12.5 శాతం వేతనాన్ని డిసెంబర్ 2020 నుండి పెంచుతారు.

ఆ ఉద్యోగులపై చివరి వారంలో
ఓయోలో మే 4వ తేదీ నుండి చాలామంది ఉద్యోగులు వేతనం లేని సెలవులపై వెళ్లారు. వీరి గురించి అడిగితే.. ఆగస్ట్ చివరి వారంలో స్పష్టత వస్తుందని చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం తమ వ్యాపారం కోవిడ్ కంటే ముందు పరిస్థితులతో పోలిస్తే కేవలం 30 శాతంతో బిజినెస్ సాగుతోందని ఓయో చెబుతోంది. జూన్ నెలలో ఓయో ఉద్యోగుల తొలగింతపై ప్రకటన చేసింది. బిజినెస్ లేక హోటల్ యజమానులతో ఒప్పందాలు నిలిపివేసింది.


Click it and Unblock the Notifications