OYO: సాధారణంగా వేరే ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు మొదటగా ప్లాన్ చేసుకునే విషయం ఉండటానికి హోటల్. ఉన్నత వర్గాల వారికి 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. కానీ సామాన్యుడి విషయం అందుకు భిన్నంగా ఉంటుంది. సరిగ్గా ఇదే అవసరానికి టెక్నాలజీ దన్నుతో ఓ సొల్యూషన్ చూపిన వ్యక్తి OYO CEO రితేష్ అగర్వాల్. హాస్పిటాలిటీ రంగంలో OYO రూమ్స్ ఓ సంచలనమనే చెప్పాలి.
ఇప్పుడు ఇంతగా పాపులర్ అయిన OYO CEO రితేష్ అగర్వాల్ జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించారు. స్వంత హాస్పిటాలిటీ కంపెనీకి నాయకత్వం వహించడమే కాకుండా అవసరమైనప్పుడు ఫ్రంట్ డెస్క్ మేనేజర్ మరియు క్లీనింగ్ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.

19 ఏళ్ల వయస్సులోనే కళాశాల నుంచి తప్పుకోవడానికి రితేష్ అగర్వాల్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇదే ఆయన జీవితానికి ఓ కీలక మలుపు తిప్పుతుందని అప్పుడు ఆయన ఊహించలేదు. బిలియనీర్ పీటర్ థీల్ స్థాపించిన ప్రతిష్ఠాత్మక థీల్ ఫెలోషిప్‌కు ఆయనను అర్హత సాధించేలా చేసింది. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా గ్రహీతగా ఆయన చరిత్ర సృష్టించారు. దీని ద్వారా లక్ష డాలర్లు మంజూరు అయ్యాయి. ఈ ఆర్థిక సహాయంతోనే స్వంత హాస్పిటాలిటీ వెంచర్ OYOని ప్రారంభించాలనే ప్రణాళికతో భారతదేశానికి తిరిగి వచ్చారు.
OYO ప్రారంభ దశలో హోటల్ సిబ్బంది నిర్వహించే వివిధ పనులను రితేష్ చేసేవారు. "క్లీనింగ్, కస్టమర్ కేర్, ఫ్రంట్ డెస్క్ నిర్వహణ వంటి పలు విభాగాలను చూసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో హోటల్ గదిని శుభ్రం చేస్తున్నప్పుడు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. క్లీన్ చేయడానికి ఆలస్యంగా వచ్చినందుకు కోపం తెచ్చుకున్న ఓ కస్టమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే నా అంకితభావం, పరిపూర్ణత అర్థం చేసుకున్న తరువాత అదే కస్టమర్ ప్రశంసిస్తూ రూ.20 టిప్ కూడా ఇచ్చారు" అని అప్పటి విషయాలు గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications