Oxfam report: ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా ఇప్పటికే పలువురు టాప్ ప్లేస్‌లో నిలిచారు. వారి సంపద విలువ కొన్ని బిలియన్ డాలర్ల పైమాటే. అయితే ఇప్పటి వరకు మిలియనీర్లు, బిలియనీర్ల గురించి విన్నాం కానీ ట్రిలియనీర్ అనే పదం మనకు కొత్త. త్వరలోనే ఇది కూడా వినియోగంలోకి రానుంది.
స్వచ్ఛంద సేవా సంస్థ ఆక్స్‌ఫామ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల నికర విలువ వల్ల బిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారినట్లు తెలిపింది. ఐదుగురు ధనవంతుల సంపద 2020 నుంచి రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగినట్లు వెల్లడించింది. ఇదే కొనసాగితే దశాబ్దంలోపు ప్రపంచం 'మొదటి ట్రిలియనీర్'ను చూస్తుందని అంచనా వేసింది. అయితే మరో 229 సంవత్సరాల వరకు పేదరికం నిర్మూలించబడదని కూడా పేర్కొంది.

ప్రపంచంలోని అత్యంత సంపన్నులు టెస్లా CEO ఎలోన్ మస్క్, LVMH చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్ సహా ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మొత్తం సంపద విపరీతంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. మార్చి 2020లోని 405 బిలియన్ డాలర్ల నుంచి నవంబర్ 2023 నాటికి 869 బిలియన్ల మేర వృద్ధి కనిపించినట్లు ప్రకటించింది. కాగా గంటకు దాదాపు 14 మిలియన్ డాలర్ల చొప్పున పెరుగుదల నమోదైనట్లు స్పష్టం చేసింది.
ప్రపంచంలోని అతిపెద్ద 10 సంస్థల్లోని ఏడింటిలో బిలియనీర్‌లు CEO లేదా ప్రధాన వాటాదారులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఈ కంపెనీల విలువ 10.2 ట్రిలియన్లు డాలర్లు కాగా ఇది ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల సంయుక్త GDPల కంటే ఎక్కువ అని ఆక్స్‌ఫామ్ వివరించింది.
ఇదే సమయంలో ప్రపంచంలోని పేదరికం కొవిడ్ ముందు స్థాయిల్లోనే చిక్కుకుపోయినట్లు నివేదిక కనుగొంది. గత 3 సంవత్సరాల్లో ఆయా వ్యక్తుల సంపదలో విపరీతమైన పెరుగుదల కనిపించినట్లు చెప్పింది. బిలియనీర్లు 2020 కంటే సగటున 3.3 ట్రిలియన్ డాలర్ల మేర ధనవంతులయ్యారు. వారి సంపద ద్రవ్యోల్బణం రేటు కంటే 3 రెట్లు వేగంగా పెరిగింది.


Click it and Unblock the Notifications