షాకింగ్: మాల్యా-చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,600 కోట్ల రుణాలు రద్దు!
ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు, బ్యాంకులకు వేలకోట్లు టోపీ పెట్టి దేశం నుండి పారిపోయిన కొంతమందికి.. బ్యాంకులు రూ.68,000 కోట్ల రుణాలు రద్దు చేశాయని సమాచార హక్కు చట్టం కార్యకర్త సాకేత్ గోఖలే RTI కింద అడిగిన వివరాలు ద్వారా వెల్లడైంది. సెప్టెంబర్ 30, 2019 నాటికి రద్దయిన రుణాలు అక్షరాలా రూ.68,607 కోట్లు. సాకేత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తనకు 50 మంది టాప్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు, వారి కరెంట్ లోన్ స్టేటస్ కావాలని ఫిబ్రవరి 16న దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 24న సమాధానం వచ్చింది.

అందుకే ఆర్టీఐ చట్టం కింద సమాధానం కోరా
ఈ మేరకు సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలోనే టాప్ 50 విల్‌ఫుల్ డిఫాల్టర్లు, వారి కరెంట్ లోన్ స్టేటస్ కావాలని లోకసభలో అడిగారని, దానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పేందుకు నిరాకరించారని, దీంతో తాను RTI కింద సమాధానం కోసం దరఖాస్తు చేశానని పేర్కొన్నారు. దీంతో ఆర్బీఐ 30 సెప్టెంబర్ 2019 నాటికి విల్ ఫుల్ డిఫాల్టర్లు, రుణాల రద్దు వివరాలను అందించిందని తెలిపారు.

చోక్సీ, మాల్యా రుణాలు రద్దు
విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో అగ్రస్థానంలో విదేశాలకు పారిపోయిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఓనర్ మెహుల్ చోక్సీ ఉన్నారు. ఆ తర్వాత రెండు మూడో స్థానాల్లో FMCG కంపెనీ REI ఆగ్రో లిమిటెడ్, జతిన్ మెహతా విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్ ఉన్నాయి. లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఉన్నాడు. ఇతని కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు రద్దు చేశారు.

వీరి రుణాలు రద్దు..
టాప్ 50లో మొదటి స్థానంలో ఉన్న చోక్సీ కంపెనీలకు చెందిన రూ.5,492 కోట్ల రుణాలను ఆర్బీఐ రద్దు చేసింది. REI ఆగ్రోకు చెందిన రూ.4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్‌కు చెందిన రూ.4,076 కోట్లు, రోటోమా గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన రూ.2,850 కోట్లు, ఖుదోస్ కెమి లిమిటెడ్‌కు చెందిన రూ.2,326 కోట్లు, జూమ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్ల రుణాలు రద్దయ్యాయి. మాల్యాకు చెందిన రూ.1,943 కోట్లను బ్యాంకులు టెక్నికల్‌గా కొట్టి వేశాయి. ఫరెవర్ ప్రీసియస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్ ప్రయివేటు లిమిటెడ్ రూ.1,962 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు, చోక్సీకి చెందిన ఇతర కంపెనీలు గిలి ఇంండియా లిమిటెడ్ రూ.1,447 కోట్లు, నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ రూ.1,109 కోట్లు రద్దు చేశారు. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రూ.2,212 కోట్ల రుణాలు రద్దు చేశారు. టాప్ 50 మంది వివిధ బ్యాంకులకు ఎగవేసిన రుణాల విలువ రూ.68,607 కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. అయితే బ్యాంకుల పద్దు కోసం కొన్నింటిని రుణ బుక్ నుండి కొట్టి వేస్తారు. కానీ వాటిని వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఉదాహరణకు విజయ్ మాల్యానే ఉదాహరణ. ఆయనకు చెందిన దాదాపు రూ.2,000 కోట్ల రుణాలు కొట్టి వేసినట్లుగా ఉంది. కానీ ఆయన బ్యాంకులకు ఎగ్గొట్టి వెళ్లిన మొత్తం రుణాలను చట్టపరంగా వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications