300 కంపెనీల నుండి 24 తగ్గనున్న ప్రభుత్వ సంస్థలు! మోడీ ప్రభుత్వం 'వ్యూహాత్మక' రంగాలు
ప్రభుత్వం 300 ప్రభుత్వరంగ కంపెనీలను దాదాపు రెండు డజన్లకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రయివేటైజేషన్ పైన దృష్టి సారించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థలు (PSU)లు భారీగా తగ్గిపోనున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో PUS ప్రయివేటీకరణ జోరుకు మార్గం సుగమం చేస్తోంది. ఇందులో భాగంగా PSUల సంఖ్యను భారీగా తగ్గించనుంది.

మూడింట ఏదో ఒకటి
ప్రయివేటైజేషన్ పైన నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగా మోడీ ప్రభుత్వం తుది నిర్ణయానికి రానున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి గాను టార్గెట్ పెట్టుకుంటోంది. గత ఏడాది కరోనా కారణంగా ఇది కుదరలేదు. తాజా బడ్జెట్‌లో డిజిన్వెస్టమెంట్ పాలసీని ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రంగాలకు చెందిన PSUలను కనిష్ఠస్థాయికి తగ్గించుకోవడం, వ్యూహాత్మకం కాని మిగతా సంస్థలను ప్రయివేటీకరించడం లేదా మరో PSUలో విలీనం చేయడం లేదా మూసివేత జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అసలు ఉద్దేశ్యం ఇదీ
మొత్తం నాలుగు రంగాలు.. ఒకటి అణుశక్తి, అంతరిక్షం, రెండు రక్షణ రవాణ, టెలీకమ్యూనికేషన్స్ మూడు విద్యుత్, పెట్రోలియం, బొగ్గు వంటి ఖనిజాలు నాలుగు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలను వ్యూహాత్మక రంగాల విభాగంలోకి చేర్చారు. వ్యూహాత్మకేతర రంగాల్లో అన్ని PSUలను ప్రయివేటీకరించడం లేదా మూసివేసే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీల పాత్ర తగ్గించి ప్రయివేటు రంగంలో కొత్త పెట్టుబడులకు అవకాశం కల్పించడమే పెట్టుబడుల ఉపసంహరణ ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.75 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ అనుబంధ విభాగంగా ఉన్న ఐడీబీఐ బ్యాంకుతో పాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరించనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. ఐపీవో ద్వారా ఎల్ఐసీలో మైనార్టీ వాటా విక్రయంతో పాటు ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పోరేషన్, కంటైనర్ కార్పోరేషన్ వంటి సంస్థలను ప్రయివేటీకరించనున్నారు.


Click it and Unblock the Notifications