లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) హోమ్ డెలివరీ సిస్టమ్‌లో నవంబర్ 1వ తేదీ నుండి మార్పు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలనుండి మీ గ్యాస్ సిలిండర్ మీ ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP) అవసరం. నివేదిక ప్రకారం దొంగతనాలు అరికట్టేందుకు, వాస్తవ వినియోగదారుడిని గుర్తించడానికి చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త సిస్టమ్‌ను డెలివరీ అథెంటికేషన్ కోడ్(DAC)గా పేర్కొంటున్నారు. దీనిని చమురు రంగ కంపెనీలతో పాటు వినియోగదారుడి ప్రయోజనంకోసం ప్రవేశ పెడుతున్నారు.

నవంబర్ 1వ తేదీ నుండి.. అందుకే
సిలిండర్లు పక్కదారి పట్టకుండా అసలైన వినియోగదారులకు సిలిండర్లు చేరవేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకు రావాలని చమురు కంపెనీలు యోచిస్తున్నాయి. DAC వ్యవస్థలో ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసిన అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబర్ పైన OTP వస్తుంది. సిలిండర్ డెలివరీ సమయంలో ఎల్పీజీ సిలండర్‌ను తీసుకోవడానికి వినియోగదారుడు ఆ OTPని చూపించాలి. మొదట 100 స్మార్ట్ సిటీల్లో ఈ విధానాన్ని నవంబర్ 1వ తేదీ నుండి తీసుకు రావాలని చమురు రంగ కంపెనీలు యోచిస్తున్నాయి. దశల వారీగా విస్తరిస్తారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నారు.

వారికి ఇబ్బందికరం...
సంబంధిత డీలర్ వద్ద వివాలు నమోదు చేసుకోని వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ సిలిండర్లకు వర్తించదు.

రియల్ టైమ్ అప్లికేషన్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు
ఈ విధానంలో వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది ఎల్పీజీ సిలిండర్ డెలివరీ చేసేవారికి ఈ ఓటీపీ చూపించాలి.వినియోగదారు మొబైల్ నెంబర్ అప్ డేట్ చేయకపోతే డెలివరీ చేసే వ్యక్తి రియల్ టైమ్ అఫ్లికేషన్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు. కోడ్‌ను జనరేట్ చేయవచ్చు.DAC విధానం అమలైన తర్వాత వివరాలు అప్ డేట్ చేయని కస్టమర్లు ఇబ్బందులు పడవచ్చు. తప్పుడు వివరాలు ఉంటే ఎల్పీజీ సిలిండర్ హోమ్ డెలివరీ కాదు.


Click it and Unblock the Notifications