సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఒకేసారి 21,000 మందిని తీసేసిన ప్రముఖ ఐటీ సంస్థ!
సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం అంటే ఒకప్పుడు లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ, గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఐటీ ఉద్యోగుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21,000 మంది ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపించేసింది. కంపెనీ రిలీజ్ చేసిన తాజా వార్షిక నివేదికలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
గతేడాది మే నెలలో ఒరాకిల్ కంపెనీలో దాదాపు 1,62,000 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది మే 31 నాటికి ఆ సంఖ్య 1,41,000 కి పడిపోయింది. అంటే కంపెనీలో పనిచేసే మొత్తం సిబ్బందిలో దాదాపు 13 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారన్నమాట.

ఉద్యోగాలు పోవడానికి అసలు కారణం ఇదే!
ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేయడానికి ముఖ్య కారణం-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అవును, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ ట్రెండ్ వైపు ఒరాకిల్ తన బిజినెస్‌ను మారుస్తోంది. కంపెనీ అంతర్గత పనుల్లో ఏఐ టెక్నాలజీని ఎక్కువగా వాడుతుండడం వల్ల చాలా పనులు సులభంగా అయిపోతున్నాయి. దీనివల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోయింది. భవిష్యత్తులో కూడా ఈ ఏఐ టెక్నాలజీ కారణంగా మరికొన్ని ఉద్యోగాలు ఊడే అవకాశం ఉందని కంపెనీ స్వయంగా హింట్ ఇచ్చింది.
కంపెనీకి రూ.15,000 కోట్ల ఖర్చు!
ఉద్యోగులను తీసేయడం అంటే ఊరికే కుదరదు కదా! వాళ్లకు సెటిల్మెంట్ కింద భారీగా డబ్బులు ఇవ్వాలి. ఈ లేఆఫ్స్ వల్ల ఒరాకిల్ కంపెనీకి సెవరెన్స్ పేమెంట్స్ (పరిహారం) , ఇతర ఖర్చుల రూపంలో ఏకంగా 1.8 బిలియన్ డాలర్లు (మన దేశీ కరెన్సీలో దాదాపు రూ.15,000 కోట్లకు పైగా) ఖర్చయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఖర్చు చాలా ఎక్కువ. అయితే, ఇలా ఉద్యోగులను తొలగించడం వల్ల కొన్ని కీలక విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఏర్పడి, కంపెనీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందని ఒరాకిల్ అంగీకరించింది.
డేటా సెంటర్లపైనే పూర్తి ఫోకస్
ఒకపక్క ఉద్యోగులను తీసేస్తున్నా.. ఏఐ కోసం మౌలిక వసతులను పెంచేందుకు ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. ఓపెన్ ఏఐ (OpenAI), మెటా (Meta) లాంటి పెద్ద పెద్ద ఏఐ కంపెనీలకు ఒరాకిల్ క్లౌడ్ సర్వీసులను అందిస్తోంది. అందుకోసం ఈ ఏడాది ఏకంగా 50 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి కొత్త డేటా సెంటర్లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది.
ఇది కేవలం ఒరాకిల్ కథ మాత్రమే కాదు.. అమెజాన్, గూగుల్, మెటా లాంటి పెద్ద కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల జీతాల ఖర్చును తగ్గించుకుని, ఆ డబ్బును ఏఐ టెక్నాలజీ, డేటా సెంటర్లపై పెట్టడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి.


Click it and Unblock the Notifications