ఒరాకిల్ తొలగింపులు: 12 ఏళ్లు కష్టపడితే.. ఈ షాక్ ఎందుకు?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. భారత్‌తో సహా పలు దేశాల్లోని తమ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించింది. 'ఈ రోజే మీకు కంపెనీలో చివరి రోజు' అంటూ ఓ ఈ-మెయిల్ పంపి చేతులు దులుపుకుంది.
ఈ లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన సౌరభ్ సాహు అనే ఉద్యోగి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆయన భార్య పూజా సాహు, తన భర్తకు ఎదురైన అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు.
టెక్ ప్రపంచంలో తమ కుటుంబాల కోసం రేయింబవళ్లు కష్టపడి, ఉద్యోగానికే అంకితమైన ప్రతీ ఒక్కరికీ ఈ పోస్ట్ అంకితం అంటూ పూజా సాహు తన పోస్ట్‌ను ప్రారంభించారు. తన భర్త ఒరాకిల్‌లో పనిచేసిన 12 ఏళ్లలో కంపెనీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సెలవు రోజులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చివరికి హోలీ, దీపావళి వంటి పండగలప్పుడు కూడా ఆయన కంపెనీ కోసమే పనిచేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. తనకు సర్జరీ జరిగినప్పుడు హాస్పిటల్‌లో ఉంటూ కూడా, తన ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో లాగిన్ చేసి పనిచేశారని ఆమె పేర్కొన్నారు.
"నా భర్తకు ఎంత పని ఒత్తిడి ఉన్నా, కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడూ నవ్వుతూ, చుట్టూ ఉన్నవారికి సహాయం చేసేవారు. 12 ఏళ్లుగా ఉద్యోగానికే అంకితమై పనిచేసినందుకు ఆయనకు దక్కిన బహుమతి ఈ తొలగింపు" అని ఆమె ఆవేదనతో రాశారు. "నా భర్తకు ఐటీ రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది, ఆయనకు ఏదైనా ఉద్యోగావకాశం ఉంటే దయచేసి తెలియజేయండి" అని ఆమె అభ్యర్థించారు.
సౌరభ్ సాహు ఉదంతం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏళ్ల తరబడి కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించే ఉద్యోగులకు చివరికి మిగిలేది ఇదేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడు ఏ ఈ-మెయిల్ వస్తుందోనని, తమ ఉద్యోగానికి గ్యారెంటీ లేదనే భయం ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది.
ఒరాకిల్ తొలగించిన ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ (నష్టపరిహారం) ప్రకటించినప్పటికీ, చాలా మంది ఉద్యోగులు కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఉన్నట్టుండి లాగిన్ యాక్సెస్, ఆఫీస్ ఈ-మెయిల్స్‌ను బ్లాక్ చేశారని మండిపడుతున్నారు.
ఈ ఏడాదిలో ఒరాకిల్ ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు. ఏఐ (AI) రాక, ఆటోమేషన్, కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ వంటి రకరకాల కారణాలు చూపుతూ ఒరాకిల్ వరుసగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది.


Click it and Unblock the Notifications
