Layoffs: కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దానికి తోడు అంతర్జాతీయంగా ఏర్పడిన మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదో ఒక మూల నుంచి లేఆఫ్ లు వినిపిస్తూనే ఉన్నాయి. దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా, గూగుల్ ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా క్లౌడ్ మేజర్ ఒరాకిల్ వంతు వచ్చింది.
ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ రికార్డ్స్ సంస్థ సెర్నర్ ను ఒరాకిల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 28.4 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆ కంపెనీని సొంతం చేసుకుంది. కాగా 28 వేల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. వారిలో 3 వేల మందిని తాజాగా తొలగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. దానికి తోడు ఈ ఏడాది జీతాల పెంపు, ప్రమోషన్లను సైతం నిలిపివేసింది.

మార్కెటింగ్, ఇంజినీరింగ్, అకౌంటింగ్, లీగల్ మరియు ప్రొడక్షన్ టీమ్స్.. తాజా లేఆఫ్ వల్ల ప్రభావితం అయినట్లు ఓ మాజీ ఉద్యోగి చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. గతంలో 200 మంది క్లౌడ్ నిపుణులను తొలగించిన ఒరాకిల్.. రెండో దఫా 3 వేల మందిని ఇంటికి పంపించింది. అయితే మరో రౌండ్ తొలగింపులు ఉంటాయా లేదా ఇంతటితో ముగిసినట్లేనా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. ఇటీవల అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మరియు పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ (PXT) విభాగాల్లోని ఉద్యోగులపై అమెజాన్ ఇండియా వేటు వేసింది. తద్వారా 9 వేల మంది సిబ్బందిపై ప్రభావం పడినట్లు కంపెనీ CEO ఆండీ జాస్సీ తెలిపారు. మార్చిలో ప్రకటించిన విధంగా ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేసినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications