దినదిన గండంగా ఐటీ కొలువులు.. 20 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఒరాకిల్..కారణం ఏంటంటే..
కృత్రిమ మేధ (AI) సాంకేతికత విస్తృతి వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నప్పటికీ.. మరోవైపు వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తోంది. ఈ పరిణామానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle). తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు, సంస్థను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చేందుకు ఒరాకిల్ చేపట్టిన అతిపెద్ద పునర్నిర్మాణ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు దారితీసింది. సోమవారం విడుదల చేసిన సంస్థ తాజా వార్షిక నివేదిక ఈ చేదు నిజాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఒరాకిల్ సమర్పించిన అధికారిక నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన మొత్తం సిబ్బందిలో ఏకంగా 13 శాతం మందిని తొలగించింది. గతేడాది ఇదే సమయానికి సంస్థలో సుమారు 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా, మే 31, 2026 నాటికి ఆ సంఖ్య 1,41,000కు పడిపోయింది.

అంటే కేవలం ఒకే ఏడాదిలో దాదాపు 21వేల మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ లేఆఫ్స్ ప్రభావం భారతీయ ఐటీ రంగానికి కూడా పెద్ద షాక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి ప్రధాన నగరాల్లోని ఒరాకిల్ కార్యాలయాల నుండి దాదాపు 10 వేల మంది ఉద్యోగులు, అంటే ఇక్కడి భారత సిబ్బందిలో సుమారు 20 శాతం మంది ఈ ఉద్వాసనకు గురయ్యారు.
తమ వ్యాపార కార్యకలాపాలన్నింటిలో ఏఐ సాంకేతికతలను విస్తృతంగా ప్రవేశపెట్టడమే ఈ సిబ్బంది తగ్గింపునకు ప్రధాన కారణమని ఒరాకిల్ స్పష్టం చేసింది. తమ అంతర్గత ప్రక్రియలలో ఏఐ సాంకేతికతలను అమలు చేయడం ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి దారితీసిందని, భవిష్యత్తులో కూడా ఈ కోతలు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
యాజమాన్య మార్పులు, వ్యూహాత్మక మార్పులతో పాటు ఏఐ ఆధారిత ఆటోమేషన్ ద్వారా తక్కువ మందితోనే పనులు పూర్తి చేయడం ఒరాకిల్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, ఈ స్థాయి లేఆఫ్స్ వల్ల కంపెనీ ఉద్యోగ విరమణ చెల్లింపులు (Severance Packages), ఇతర నిష్క్రమణ ఖర్చుల కోసం ఈ ఏడాది ఏకంగా 1.84 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 15 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది ఈ ఖర్చు కేవలం 374 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండటం గమనార్హం.
చైర్మన్ లారీ ఎల్లిసన్ నేతృత్వంలో ఒరాకిల్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత కీలకమైన పరివర్తన గుండా వెళుతోంది. కేవలం ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీగా మిగిలిపోకుండా, OpenAI, Meta వంటి దిగ్గజాల ఏఐ వర్క్‌లోడ్‌లను నిర్వహించగల క్లౌడ్ కంప్యూటింగ్ పవర్‌హౌస్‌గా ఎదగాలని ఒరాకిల్ బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మార్కెట్ లీడర్లతో తలపడేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 70 బిలియన్ డాలర్ల నికర మూలధన వ్యయాన్ని (Capital Expenditure) ప్రకటించింది.
అయితే, అమెజాన్ లేదా మైక్రోసాఫ్ట్ తరహాలో ఒరాకిల్‌కు సొంతంగా భారీ నగదు నిల్వలు లేవు. దాంతో ఈ భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణ ఖర్చుల కోసం ఒరాకిల్ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటోంది. ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి మార్కెట్ నుండి సుమారు 40 బిలియన్ డాలర్ల అప్పులు సేకరించాల్సి వస్తోంది.
ఈ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి, నిధులను ఏఐ వైపు మళ్లించడానికి కంపెనీ మానవ వనరుల వ్యయాన్ని తగ్గించుకుంటూ, ఉద్యోగుల తొలగింపులను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. టెక్ రంగంలో ఏఐ సృష్టిస్తున్న ఉత్పాదకత లాభాలు ఒకవైపు కనిపిస్తున్నా, అది సిబ్బంది భవిష్యత్తును ఏ విధంగా ప్రశ్నార్థకంగా మారుస్తుందో చెప్పడానికి ఒరాకిల్ తాజా పరిణామాలే నిదర్శనం.


Click it and Unblock the Notifications
