Free Insurance: ఉచితంగా రూ.5 లక్షల బీమా.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య గల ప్రతి ఒక్కరికి ఉచితంగా రూ.5 లక్షల బీమా కల్పించనుంది. ఈ పథకానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరు పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక రక్షణ, సామాజిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు, నామినేషన్ ఫారం వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల కుటుంబంలోని పెద్ద సభ్యుడిని బీమాకు అర్హుడిగా నమోదు చేస్తారు.
బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని ప్రభుత్వం నేరుగా అందనుంది. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ఈ నెల 19న సిద్దిపేటలో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం ఫారంలో దరఖాస్తు సంఖ్యతో పాటు లబ్ధిదారుల పూర్తి వివరాలను పారదర్శకంగా నమోదు చేసేలా కాలమ్స్ ఉంది. కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ ఎంపిక ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ ఫారాన్ని డిజైన్ చేశారు. దరఖాస్తు ఫారం మొదటి భాగంలో ప్రదేశ వివరాలు కింద లబ్ధిదారుల నివాస ప్రాంత సమాచారాన్ని కోడ్లతో సహా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇందులో జిల్లా, శాసనసభ నియోజకవర్గం పేరుతో పాటు వాటికి సంబంధించిన ప్రత్యేక కోడ్లను పొందుపరచాలి. నివాస ప్రాంతాన్ని గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించగా, గ్రామీణ ప్రాంతాల వారు మండలం, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ, వార్డు కోడ్లతో పాటు వీధి పేరు, ఇంటి నంబరు రాయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, జోన్, సర్కిల్, వార్డు కోడ్లు, వీధి పేరు, ఇంటి నంబరు వివరాలను పూర్తిగా ఫిల్ చేయాలి. వీటితో పాటు లబ్ధిదారుడికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) నంబరు కలిగి ఉంటే దానిని నమోదు చేయడంతో పాటు కులం, మతం వివరాలను నిర్ణీత కోడ్ల రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం రెండో విభాగంలో బీమా దారుడి వివరాలు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక పట్టికలను ఇచ్చారు.
బీమా దారుడి విభాగంలో కుటుంబ పెద్ద పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నంబరు (తప్పనిసరి) మొబైల్ నంబరు వివరాలు కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబంలోని మిగిలిన సభ్యుల వివరాల కోసం ఐదు వరుసలతో కూడిన పట్టికను కేటాయించగా, అందులో కుటుంబ సభ్యుల పేర్లు, తండ్రి/భర్త పేరు, లింగం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, బీమా దారుడితో ఉన్న సంబంధం వారి ఆధార్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఒకే ఫారంలో కుటుంబం మొత్తానికి సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం వద్ద భద్రపరిచే వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చివరి భాగంలో నామినీ వివరాలు, ధ్రువీకరణ ప్రక్రియను అత్యంత స్పష్టంగా పొందుపరిచాల్సి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications