బెంగళూరులో భారీ మోసం వెలుగులోకి.. ట్రేడింగ్ పేరుతో రూ.80 లక్షలు కోల్పోయిన బాధితుడు
బెంగళూరులో మరో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం బయటపడింది. అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి, చివరికి తన కష్టార్జిత సొమ్ము మొత్తం కోల్పోయాడు. మొత్తం రూ.80,11,486 మోసపోయిన బాధితుడు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
బెంగళూరులోని కృష్ణమూర్తి లేఅవుట్ లో నివసిస్తున్న 54 ఏళ్ల కిషోర్ ఎం.బీ... ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి. అతను ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ద్వారా అదనపు ఆదాయం పొందాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆస్తా క్రెడిట్ & సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ACS) అనే పేరుతో ఆన్‌లైన్‌లో ఓ సంస్థను సంప్రదించాడు. అక్కడి నుంచి ఆరవ్ గుప్తా, మీనా జోషి అనే ఇద్దరు వ్యక్తులు అతనిని సంప్రదించి, తమ సంస్థ ద్వారా అధిక లాభాల హామీతో షేర్ ట్రేడింగ్ అవకాశం ఉందని ప్రలోభపెట్టారు.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం సెప్టెంబర్ 17న ఒక గుర్తు తెలియని వ్యక్తి కిషోర్‌ను 9015 ఆస్థ VIP మోక్ష సర్కిల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు. ఈ గ్రూప్‌లో సభ్యులు తరచూ ACS ట్రేడ్ అనే యాప్ ద్వారా పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందుతున్నట్లు చూపించారు. అధిక రాబడి వస్తుందన్న నమ్మకంతో, బాధితుడు కూడా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో లాభాలు వస్తున్నట్లుగా చూపించడంతో అతనిలో నమ్మకం పెరిగింది.
అతను మొదట రూ.34,55,492 బదిలీ చేశాడు. అనంతరం, మోసగాళ్లు మరిన్ని ట్రేడింగ్ అవకాశాలు చూపిస్తూ రూ.21,80,000 బదిలీ చేయించారు. చివరగా లాభాలను ఉపసంహరించుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు అవసరం అంటూ మరో రూ.23,72,594 చెల్లింపును డిమాండ్ చేశారు. మొత్తం రూ.80,11,486 బదిలీ చేసిన తర్వాత కూడా, కిషోర్ తన పెట్టుబడిని గానీ, లాభాలను గానీ తిరిగి పొందలేకపోయాడు. డబ్బు పోయిందని గ్రహించిన అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
బెంగళూరు పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్లు 66(C), 66(D), భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం ఈ మోసాన్ని దర్యాప్తు చేస్తోంది. పోలీసులు మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవలి నెలల్లో బెంగళూరులో ఇలాంటి ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లాభాల ప్రలోభంతో వ్యక్తులు తెలియని యాప్‌లు, ట్రేడింగ్ లింకులు వాట్సాప్ గ్రూప్‌లకు బలవుతున్నారు. నిపుణుల సూచన ప్రకారం తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. లాభాల హామీ ఇచ్చే పెట్టుబడి లింకులపై విశ్వాసం ఉంచకూడదు.


Click it and Unblock the Notifications