ఆన్‌లైన్ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకున్నారా..ఇలా చేస్తే పోయిన మొత్తం వెంటనే మీ ఖాతాలో పడిపోతుంది
భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ పేమెంట్లు ఎక్కువ కావడంతో, మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు కనుగొని ప్రజలను మోసం చేస్తున్నారు. హ్యాకర్ UPI లింక్ పంపడం, వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు షేర్ చేయడం, బ్యాంక్ ఉద్యోగులుగా నటించి OTP అడగడం, నకిలీ పెట్టుబడి పథకాలతో ఆకర్షించడం.. ఇవన్నీ చాలా సాధారణం అవుతున్నాయి. దీని వల్ల అమాయకులు కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో మాయం అవుతోంది.
మోసగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకునే వారు సాధారణ ప్రజలే. కొత్తగా ఎవరైనా UPI వాడటం మొదలుపెట్టినా, ఇంకొకరు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేసినా, మరోవైపు కొందరు అనుకోకుండా ఫ్రాడ్ లింక్‌పై క్లిక్ చేసినా.. అందరూ ఈ online Scam లకు బలవుతున్నారు. అయితే ఒకసారి మీరు మోసపోతే, డబ్బు తిరిగి వస్తుందా అన్న అనుమానం వెంటనే మీకు కలుగుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మీరు వెంటనే చర్య తీసుకుంటే, మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930. మీరు ఏ రూపంలోనైనా ఆన్‌లైన్ మోసానికి గురైతే.. ఈ నంబర్‌కి వెంటనే కాల్ చేయాలి. ముఖ్యంగా.. మీరు మోసపోయిన మొదటి 60 నిమిషాలు అత్యంత కీలకమైన నిమిషాలు. ఎందుకంటే ఆ సమయంలోనే ఫ్రాడ్ ఖాతాలను బ్లాక్ చేయడం, ట్రాన్సాక్షన్‌ను స్టాప్ చేయడం సులభమవుతుంది. ఒకవేళ ఆ సమయం దాటితే.. డబ్బు మరిన్ని ఖాతాలకు బదిలీ అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు తిరిగి పొందడం చాలా కష్టతరం అవుతుంది.
ఇటీవల హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన ఒక పెద్ద ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి ఆన్‌లైన్ మోసంలో రూ.80 లక్షలు కోల్పోయాడు. కానీ అతను వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫలితంగా.. అధికారులు ఆ ఖాతాలను బ్లాక్ చేసి, అతనికి రూ. 60 లక్షలు తిరిగి ఇవ్వగలిగారు.ఈ ఉదాహరణ ప్రకారం.. మీరు త్వరగా స్పందిస్తే మీ డబ్బు రక్షించబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
మీరు కాల్ చేసే సమయంలో అవసరమైన కొన్ని వివరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు డబ్బు పంపిన ఖాతా నంబర్, ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది, అది ఏ సమయానికి జరిగింది, ఏదైనా ట్రాన్సాక్షన్ ఐడి ఉంటే దాని పేరు.. ఇవన్నీ చెప్పడం ద్వారా పోలీసులు మీ ఫిర్యాదును త్వరగా ప్రాసెస్ చేస్తారు. అలాగే, మీరు 1930కు కాల్ చేసిన తర్వాత సైబర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్ (www.cybercrime.gov.in) లోకి వెళ్లి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అక్కడ మీరు మీ ఫిర్యాదు స్థితిని కూడా సులభంగా ట్రాక్ చేయవచ్చు.
ఈ విధంగా మీరు చేసిన ప్రయత్నంతో డబ్బు రికవరీ అయ్యే అవకాశాలను మరింత పెంచుతుంది.సాధారణంగా ప్రజలు మోసపోయిన తర్వాత భయపడి ఎవరికీ చెప్పకుండా ఉండిపోతారు. కానీ ఇది తప్పు. మీరు వెంటనే హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి, సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారానే సమస్య నుంచి బయటపడవచ్చు.మీరు మోసపోయిన మొదటి గంటలో 1930కి కాల్ చేయడం మీ డబ్బును కాపాడే బలమైన ఆయుధం.


Click it and Unblock the Notifications