Online Gaming: ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై ఇటీవల భారత ప్రభుత్వం GST పెంచింది. ఇదికాక నిబంధనలు పాటించడంలో గతంలో అలసత్వం వహించారంటూ GST విభాగం షాకిచ్చింది. గేమింగ్, క్యాసినో వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీకి ఈ వ్యవహారంపై నోటీసులు అందాయి. దీంతో దాని షేర్లలో భారీ పతనం నమోదైంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ నుంచి మొత్తం 16 వేల 822 కోట్లకు గాను పన్ను నోటీసులు అందినట్లు డెల్టా కార్ప్ తెలిపింది. జూలై 2017-మార్చి 2022 మధ్య కాలానికి ఈ నోటీసులు వచ్చినట్లు పేర్కొంది. ఇదే విషయాన్ని గత శుక్రవారం ఎక్స్ఛేంజ్ లకు సైతం తెలియజేసింది. దీంతో ఇవాళ షేర్ విలువ ఏకంగా 20 శాతం క్రాష్ అయింది.

డెల్టా కార్ప్ ఇలా క్రాష్ కావడం దాదాపు 3 నెలల వ్యవధిలో ఇది రెండోసారి. మొదటిసారిగా ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై GST కౌన్సిల్ 28 శాతం ట్యాక్స్ విధించిన సమయంలో ఈ ఏడాది జూలై 12న 23 శాతం నష్టపోయింది. కాగా ప్రస్తుతం 20 శాతం పడిపోవడంతో రెండో అతిపెద్ద క్రాష్ ఇవాళ నమోదైంది.
షేర్ వాల్యూ క్షీణతతో డెల్టా కార్ప్ మార్కెట్ క్యాప్ 4 వేల 692 వేల కోట్ల నుంచి 3 వేల 850 కోట్లకు పడిపోయింది. ఈ రెండు భారీ క్రాష్‌ల వల్ల ఈ ఏడాదిలో 30.91 శాతం నష్టపోయింది. అయితే మొత్తం ట్యాక్స్ డిమాండ్ విలువలో డెల్టా కార్ప్ పై 11 వేల 140 కోట్లు, దాని అనుబంధ సంస్థలు క్యాసినో డెల్టిన్ డెన్ జాంగ్, హైస్ట్రీట్ క్రూయిసెస్, డెల్టా ప్లెజర్ క్రూయిసెస్ పై దాదాపు 5 వేల 682 కోట్లకు GST విభాగం నోటీసులు ఇచ్చింది.
'పన్ను డిమాండ్లు కేవలం డెల్టా కార్ప్ ఒక్క సమస్యే కాదు, పరిశ్రమ వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతం మాకు అందిన ఈ నోటీసులు ఏకపక్షంగా మరియు చట్టవిరుద్ధంగా ఉన్నట్లు మా న్యాయనిపుణులు భావిస్తున్నారు. వీటిని సవాలు చేయడానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్ని పరిష్కారాలను అనుసరిస్తాము' అని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications