ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్..తెలంగాణలో 1000 మందికి పైగా ఆత్మహత్య..అప్పుల ఊబి నుంచి బయటపడలేక..
Online Betting Apps: సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఒక క్లిక్‌తో భారీగా డబ్బు గెలుస్తామని చెప్పే బెట్టింగ్ యాప్‌లు ఇప్పుడు వేలాది కుటుంబాల జీవితాలను చిదిమేస్తున్నాయి. క్రీడలు, గేమింగ్ లేదా ఫాంటసీ స్పోర్ట్స్ అనే పేరుతో వచ్చిన ఈ యాప్‌లు వాస్తవానికి జూదానికి సమానమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఈ వ్యసనం ఎంత తీవ్రంగా ఉందో తాజాగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాల్లోనే 1,023 మందికి పైగా యువకులు, మధ్యవయస్కులు అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. దానిలో ఈ యాప్‌లు చట్టవిరుద్ధం, వెంటనే నిషేధించాలని పిటినర్లు వాదించారు. పిటిషన్ చదివిన సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, గూగుల్ ఇండియా, ఆపిల్ ఇండియా, డ్రీమ్11, MPL వంటి టెక్ కంపెనీలకు కూడా నోటీసులు పంపింది.

భారతదేశంలో జూదం చట్టం చాలా పాతదని చెప్పుకోవచ్చు. ఇది 1867 కాలంనాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్. అది అప్పటి కాలానికి సరిపోయేది అయితే.. నేటి డిజిటల్ యాప్‌లకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా ఈ ఖాళీని అనేక ఆఫ్‌షోర్ కంపెనీలు వాడుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బు పెట్టి గెలుస్తామా లేదా ఓడిపోతామా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది.
నియమాల ప్రకారం నైపుణ్యం ఉన్న ఆటలు (Skill Games) దేశంలో చట్టబద్ధం. ఉదాహరణకు, రమ్మీ, ఫాంటసీ క్రికెట్ వంటి గేమ్స్ కోర్టులు నైపుణ్య ఆధారంగా వర్గీకరించాయి. అయితే ఇవి నిజంగా నైపుణ్యమైన ఆటలా, లేక డబ్బు పోగొట్టించే జూదాలా అనే సందేహం ఇంకా పరిష్కారం దొరకడం లేదు. ఇక UNICEF రిపోర్ట్ ప్రకారం..భారతదేశంలో పిల్లలు రోజుకు 1,000 డాలర్ల వరకు జూదానికి ఖర్చు చేస్తున్నారని చెబుతోంది. ఇది కేవలం వినోదం కాదని ప్రజారోగ్య సంక్షోభంగా మారిపోయింది రిపోర్ట్ చెబుతోంది.
ప్రముఖులు (సినీ నటులు, క్రికెటర్లు) ఈ యాప్‌లను ప్రకటనలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారనే వార్తల మధ్య వారిపై చర్యలు తీసుకోవడం చకచక జరిగిపోతున్నాయి. ఈ మత్తులో పడి ఒక్క తెలంగాణలో 1,023 మంది ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఉద్యోగాలు వస్తాయి, పన్నులు వస్తాయని ఓ వైపు పరిశ్రమ ఊదరగొడుతుండగా.. వాస్తవ రూపంలో సుమారు 20 నుంచి 30 బిలియన్ డాలర్ల డబ్బు బ్లాక్ మార్కెట్‌లో తిరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ GST విధానం (28%) కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఎక్కువ పన్నులు వేయడంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు.
ఏదేమైనా ఈ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు చాలా కీలకం కానుంది. ఈ తీర్పుతోనే దేశం ఆన్‌లైన్ గేమింగ్‌ని ఏ విధంగా చూడబోతుందో తేలనుంది. ఒకవైపు యువత ప్రాణాలు, కుటుంబాల భవిష్యత్తు; మరోవైపు పెద్ద పరిశ్రమ, పన్ను ఆదాయం.. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉంది. మరీ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications