Onion Price: భారీ పెరిగిన ఉల్లి ధర.. కిలో రూ.70..!
ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రోజురోజుకు ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. నెల క్రితం కిలో ఉల్లి రూ.30 ఉండగా.. ఇప్పుడు రూ.70కి చేరింది. ధర దాదాపు 110 శాతం పెరిగింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మలక్‌పేట్ హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర గరిష్టంగా రూ.45 వేల నుంచి రూ.52 వేలు చేరిందని చెబుతున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.65 నుంచి రూ.70కి పెరిగినట్లు తెలిపారు. తెలంగాణకు ఎక్కువగా మహారాష్ట్ర, ఏపీలోని కర్నూల్ నుంచి ఉల్లి వస్తుంది.
ఇటీవల ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడడంతో ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో రాష్ట్రానికి ఉల్లి దిగుమతి బాగా తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కూడా ఉల్లి రైతులకు నష్టాలు రావడంతో కర్నూల్లో రైతులు ఉల్లి సాగు తగ్గించారు. రెండు ఎకరాల్లో ఉల్లి వేసిన రైతులకు కనీసం 150 బస్తాల ఉల్లి దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల కారణంగా కనీసం 50 బస్తాలు కూడా రాలేదని తెలుస్తోంది. దీంతో మార్కెట్‌కు ఉల్లి రాక తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ధరలు భారీగా పెరిగినట్లు వివరిస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీ నుంచి రోజూ వంద పైచిలుకు ఉల్లి లారీలు హైదరాబాద్ కు వస్తుంటాయని.. ఇప్పుడు ఉల్లి తగ్గిందన్నారు.

శనివారం నాడు మలక్‌పేట్, ఉస్మాన్‌గంజ్ హోల్‌సేల్ మార్కెట్‌కు కేవలం 53 ఉల్లి లోడ్లు మాత్రమే వచ్చాయని వ్యాపారులు చెప్పారు. మహారాష్ట్ర నుంచి 39 లారీలు, కర్నూల్ నుంచి 10, కర్ణాటక నుంచి 4 లోడ్ల ఉల్లి వచ్చినట్లు తెలిపారు. ఉల్లి లోడ్ల సంఖ్య సగానికి పడిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, తాండూరు, మెదక్ , నారాయణఖేడ్, కొల్లాపూర్, అలంపూర్, నల్గొండ తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో పండే ఉల్లి అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్కెట్‌కు వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ పంట వస్తేనే ధరలు కొంచెం దిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రాయితీ విక్రయాలు ప్రారంభమైన పది రోజుల్లోనే 17 ప్రధాన నగరాల్లో దాదాపు 4,000 టన్నుల బఫర్ ఉల్లి విక్రయించారు. ముఖ్యంగా ధరల ప్రభావం అధికంగా ఉన్న నగరాల్లో కిలో రూ.35 చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
