Onion Price: మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధరలు.. ఎన్నికల వేళ కేంద్రం నిఘా..
Onion Price: దేశంలో సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వంటింటి సామాను ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట పెరిగిన ఉల్లి తర్వాత తగ్గినప్పటికీ మళ్లీ కన్నీరు పెట్టించేందుకు సిద్ధమౌతోంది.
మార్కెట్‌లో ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉల్లి బస్తా ధర రూ.1,600 నుంచి 2,000 రూపాయల వరకు హోల్ సేల్ మార్కెట్లో పలుకుతోంది. అయితే ఇది ఉల్లి పండించిన రైతులకు కొంత సానుకూలంగా ఉంది. అయితే వాతావరణ ప్రతికూలతల వల్ల ఈ ఏడాది ఉల్లి ఎక్కువగా పండింటే కర్ణాటక జిల్లాల్లో పంట నష్టం ఏర్పడింది. దీంతో ధర ఉన్నప్పటికీ రైతుల వద్ద అమ్మేందుకు పంట లేని పరిస్థితి నెలకొందని వెల్లడైంది.

వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే గడచిన నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించటంతో క్షేత్రస్థాయిలో రైతులు ఉల్లి సాగుపై పెద్దగా ఆసక్తి చూపటం లేదని వెల్లడైంది. పైగా వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో వేసిన ఉల్లి సాగు నేలకొరిగిందని రైతులు వాపోతున్నారు. అలా గడచిన నాలుగేళ్లుగా రైతులు నష్టాలనే చూస్తున్నారని వెల్లడైంది.
ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని కోరుకుంటోంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉల్లిపాయల పెరుగుతున్న ధరలను అరికట్టడానికి కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.


Click it and Unblock the Notifications