Onion Price Hike: దేశంలో ఎన్నికల ముగిశాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి గంటలు కూడా గడవకముందే సామాన్యులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే పప్పు ఉప్పుల ధరలతో సతమతమోతున్న వారు కూరగాయలు, ఉల్లి వంటి నిత్యావసరాలను సైతం కొనలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి.
తాజాగా ఉల్లి ధరలు పెరగటంతో హోటళ్లలో తినటం కూడా ఖరీదుగా మారిపోతోంది. వాస్తవానికి మహారాష్ట్రలోని లాసల్‌గావ్ మార్కెట్‌లో ఉల్లి టోకు ధర సగటున 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరగటంతో దేశంలో భారీగా ధరల పెరుగుదల కొనసాగుతోంది. గిరాకీ, సరఫరా మధ్య అంతరం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అవసరానికి అనుగుణంగా ఉల్లి సరఫరా కావడం లేదు.

ఇటీవలి రోజుల్లో ఉల్లి ధరలు 30 నుండి 50 శాతం పెరిగాయి. లాసల్‌గావ్ మండిలో బుధవారం సగటు ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.2130గా పలికింది. జూన్ 15 నాటికి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.2250 వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మండీలకు ఉల్లి రాక తగ్గడంతో ధరలపై ప్రభావం పడింది. అంతేకాకుండా బక్రీద్ పండుగ కారణంగా ధరలు కూడా పెరిగాయని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనే ఆశతో వ్యాపారులు స్టాక్‌ను కలిగి ఉన్నారని సమాచారం. గతంలో లాసల్‌గావ్ మండికి రోజుకు 12 నుండి 15 వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. అయితే ప్రస్తుతం అది 6 వేల క్వింటాళ్లకు తగ్గటం మార్కెట్లో వేగంగా ధరలను పెంచుతోంది.
ఒకవైపు ఖరీఫ్ సాగుతో రైతులు బిజీబిజీగా ఉండగా.. మరోవైపు ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేత కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దీంతో గత 4 రోజులుగా ధరలపై ప్రభావం పడింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ముంబైలో టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి, అకాల వర్షాల కారణంగా ఈ పంటలకు భారీ నష్టం వాటిల్లటం కూడా పెరుగుదలకు దారితీసింది. దీంతో సరఫరాపై ప్రభావం పడింది. జూలై నెలాఖరు వరకు ఎలాంటి ఉపశమనం ఉండదని వ్యాపారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications