కోనసీమలో చమురు అన్వేషణ.. 172 బావులు తవ్వనున్న ఓఎన్‌జీసీ, కేంద్రం గ్రీన్ సిగ్నల్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్‌లో చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. ఇందుకోసం సంస్థ రూ.8,110 కోట్ల పెట్టుబడితో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ప్రాంతంలోని భూభాగంలో 172 ఆన్‌షోర్ బావులను తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) పరిధిలో పనిచేస్తున్న నిపుణుల అంచనా కమిటీ (EAC) ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (Green Nod) మంజూరు చేసింది. గత నెల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
ఓఎన్‌జీసీ కోనసీమ ప్రాంతంలోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజ్ (PML) బ్లాకుల్లో ఈ తవ్వకాలను చేపట్టనుంది. ప్రాజెక్టు అమలులో భాగంగా సంస్థ పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP) కోసం రూ.172 కోట్లు, అలాగే ప్రజాభిప్రాయ సేకరణ (Public Hearing) కోసం రూ.11 కోట్లు వెచ్చించనుంది. అదనంగా, ప్రతి సంవత్సరం రూ.91.16 కోట్లు పునరావృత వ్యయం (recurring cost) కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణకు కఠినమైన షరతులు కూడా విధించింది. కేజీ బేసిన్ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి ఇస్తూనే, EAC పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తవ్వబడే 172 బావుల్లో ఏదీ కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండకూడదు. అటవీ ప్రాంతాలు, సంరక్షిత ప్రాంతాల గుండా ముందస్తు అనుమతి లేకుండా పైప్‌లైన్‌లు వేయరాదు. కోనసీమ ప్రాంతంలో చమురు, గ్యాస్ తవ్వకాల వలన భూమి కుంగిపోతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఈ షరతులు విధించబడినట్లు భావిస్తున్నారు.
కేజీ బేసిన్ ప్రాంతంలో సుమారు 69.8 కోట్ల టన్నుల చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురుతో పోలిస్తే దాదాపు రెండింతలు ఎక్కువ. ఈ కారణంగా ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని విస్తరించేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇప్పటికే లోతట్టు సముద్ర జలాల్లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. ఓఎన్‌జీసీ కూడా సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించింది. ఇప్పుడు భూభాగంలో కూడా పెద్దఎత్తున తవ్వకాలు జరపాలని యోచిస్తోంది.
పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో చమురు డిమాండ్ తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం రోజుకు సుమారు 54 లక్షల బ్యారెల్లు చమురు వినియోగిస్తుండగా 2050 నాటికి ఇది 91 లక్షల బ్యారెల్లకు చేరుతుందని బ్రిటిష్ పెట్రోలియం (BP) ప్రధాన ఆర్థికవేత్త స్పెన్సర్ డేల్ తెలిపారు. అదే సమయంలో సహజ వాయువు డిమాండ్ 15,300 కోట్ల ఘన మీటర్లకు (53 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్) పెరుగుతుందని అంచనా. భారతదేశంలో వచ్చే దశాబ్దాల్లో చమురు, గ్యాస్ వినియోగం ఈ స్థాయిలో పెరగడం మరో దేశంలోనూ జరగదని నిపుణులు చెబుతున్నారు. పునరుత్పాదక ఇంధనాలు పెరుగుతున్నా భారత ఇంధన వినియోగంలో చమురు వాటా ప్రధానంగా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications