pension: పెన్షన్ విధానంపై శుభవార్త చెప్పిన కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులకు వన్ టైం ఆఫర్
pension: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై వివిధ రాష్ట్రాల్లో ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం, RBI సైతం ఈ విషయంపై జాగ్రత్త వహించాలని ఆయా ప్రభుత్వాలకు సూచించాయి. కొత్త, పాత పెన్షన్ స్కీమ్ల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో సిబ్బంది సైతం.. OPS వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ NPSను అమలు చేయాలని కేంద్రం స్థిర నిశ్చయంతో ఉంది. ఈ సమయంలో తాజాగా మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

అందరికీ కాదు:
కొంతమంది గుర్తించిన ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారడానికి కేంద్రం వన్ టైం అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 22, 2003 నుంచి నేషనల్ పెన్షన్ విధానం నోటిఫై చేయబడింది. అయితే అంతకు ముందు విడుదల చేయబడిన ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా కేంద్ర సర్వీసుల్లో చేరిన వారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 1972(ప్రస్తతం 2021) ప్రకారం.. ఈ మేరకు అంగీకరించినట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 31, 2023 లోపు దీనిని ఉద్యోగులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగుల విఙప్తి, కోర్టుల ఆదేశాల మేరకు:
"జనవరి 1, 2004 తర్వాత విధుల్లోకి చేరిన ఉద్యోగుల నుంచి ఈ మేరకు పలు ప్రతిపాదనలు వచ్చాయి. NPS అమల్లోకి రాకముందే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా తాము సెలెక్ట్ అయినట్లు వారు వెల్లడించారు. కాబట్టి తమను కూడా OPSలోనే చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దానికితోడు వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సూచనలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. 14 లక్షల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కూడిన నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(NMOPS) సంస్థ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.

ఒక్కసారి మారితే..
అర్హత ఉండి, గడువు తేదీలోగా ఈ ఆప్షన్ వినియోగించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు NPS వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఒక్కసారి OPSకు మారితే తిరిగి NPSకు వచ్చే అవకాశం ఉండదని పేర్కొంది. ఉద్యోగి CCS పెన్షన్ కిందకు మారిన పక్షంలో, వారి అభ్యర్థన నియామకధికారి ముందుకు వెళుతుంది. అన్నింటినీ పరిశీలించిన పిమ్మట ఈ ఏడాది అక్టోబర్ 31లోపు ఈ మార్పునకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. ఈ తరహా ఉద్యోగుల NPS ఖాతాలను డిసెంబర్ 31, 2023 నుంచి పూర్తిగా మూసివేయున్నట్లు వివరించింది.


Click it and Unblock the Notifications