Loan Mistakes: ప్రస్తుతం డిజిటల్ యుగంలో రుణాల వితరణ చాలా వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యంలోని బ్యాంకులు గతంలో కంటే వేగంగా లోన్స్ అందిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీటి విషయంలో చేసే తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పర్సనల్ లోన్స్.. :వ్యక్తిగత రుణాల విషయంలో ఎలాంటి హామీ రుణ సంస్థకు అందించాల్సిన అవసరం ఉండదు. అందుకే వీటికి కొంత వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అవి చూసేవి కేవలం క్రెడిట్ స్కోర్. కొంత మంది తమ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ అనేక దరఖాస్తులు చేస్తుంటారు. దీని కారణంగా వారి సిబిల్ స్కోర్ మరింతగా పడిపోతుందని గమనించాలి. ఒకసారి లోన్ రిజెక్ట్ అయితే కనీసం 6 నెలలు వేచి ఉండటం మంచిది. ఈ క్రమంలో క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించటం ఉత్తమం. గతంలో చెల్లించని రుణాలు ఏవైనా ఉన్నట్లయితే అవి క్రెడిట్ స్కోర్ తగ్గిస్తాయి కాబట్టి వాటిని వెంటనే చెల్లించేందుకు ప్రయత్నించాలి. అలాగే ఎక్కువ కాలానికి రుణాలు తీసుకోవటం సరైనది కాదు.

క్రెడిట్ కార్డు లోన్..:చాలా మంది క్రెడిట్ కార్డు హోల్డర్లు అత్యవసరమని ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఎక్కువ వడ్డీ, ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మెుత్తంపై విత్ డ్రా చేసిన రోజు నుంచి వడ్డీ నెలకు 3-4 శాతం చొప్పున లెక్కించటం జరుగుతుంది. పైగా దీని వల్ల క్రెడిట్ స్కోర్ సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
కార్ లోన్..:దేశంలోని బ్యాంకింగ్ సంస్థలు ప్రస్తుతం వేగంగా కారు రుణాలు అందిస్తున్నాయి. చౌక రేట్లకు రుణాలను ఇవ్వటంతో ఇటీవల ఆటో విక్రయాలు రికార్డు స్థాయిల్లో పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వాటి రుణాలను చెల్లించేందుకు సరైన ఆర్థిక పరిస్థితి ఉందో లేదో పరిశీలించుకోకుండానే లోన్స్ తీసుకుంటున్నారు. తక్కువ ఈఎంఐల కోసం ఎక్కువ కాలం కార్ లోన్ తీసుకోవటం వల్ల అధిక వడ్డీ చెల్లించటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ మెుత్తంలో డౌన్ పేమెంట్ చెల్లించటం తక్కువ భారాన్ని కలిగిస్తుంది.
ఎడ్యుకేషన్ లోన్.. :ఉన్నత విద్య కోసం చాలా మంది నేటి కాలంలో విద్యా రుణాలను పొందేందుకు మెుగ్గు చూపుతున్నారు. ఈ రుణాలపై మారటోరం పిరియడ్ ఉంటుంది. అయితే ఈ కాలంలో చెల్లింపులు చేయకపోవటం మంచిది కాదు. రుణం పొందినప్పటి నుంచి వడ్డీ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత చెల్లిస్తూ పోవటం వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల సదరు విద్యార్థి ఉద్యోగంలో చేరాక ఈఎంఐ పెద్దగా భారాన్ని కలిగించదు.
గోల్డ్ లోన్స్..:వాస్తవానికి బంగారం తాకట్టుపై రుణాన్ని పొందటం అనేక సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కిందకు వస్తుంది. పైగా దీనిని పొందటానికి ఎలాంటి క్రెడిట్ స్కోర్ పరిశీలించరు. అందువల్ల బయటి వ్యక్తుల వద్ద ఎక్కువ వడ్డీ రేట్లకు గోల్డ్ తాకట్టు పెట్టడం కంటే బ్యాంక్ వద్ద ఉంచి రుణాన్ని పొందటం సురక్షితం పైగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి బయట వ్యక్తులను రుణాల కోసం ఆశ్రయించటం మానుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications