PM eVIDYA: వన్ క్లాస్-వన్ టీవీ ఛానల్: ఫోన్ల ద్వారా పాఠాలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. కొద్దిసేపటి కిందటే లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను చదవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 9.27 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీన్ని అందుకుంటామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఈ-విద్య పథకం కింద విద్యారంగానికి అనేక ప్రోత్సహాలను ప్రకటించినట్లు నిర్మల సీతారామన్ చెప్పారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతీయ భాషల్లో సప్లిమెంటరీ విద్యాబోధన చేయడానికి ఉద్దేశించిన పథకంగా అభివర్ణించారు. ప్రస్తుతం 12 ఛానళ్లు మాత్రమే పని చేస్తోన్నాయని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను ఏకంగా 200కు పెంచుతామని పేర్కొన్నారు.

డిజిటల్ యూనివర్శిటీని నెలకొల్పుతామని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు వారి ఇంటి వద్దకే ప్రపంచస్థాయి విద్యను అందిస్తామని నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. వేర్వేరు ప్రాంతీయ భాషలు, ఐసీటీ ఫార్మట్స్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియోలు, డిజిటల్ టీచర్ల ద్వారా అన్ని భాషల్లో అత్యున్నతమైన క్వాలిటీతో కూడిన ఇ-కంటెంట్‌ను ప్రొవైడ్ చేస్తామని నిర్మల సీతారామన్ వివరించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కూడా తమ సిలబస్‌ను దీనికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని నిర్మల సీతారామన్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సేద్యాన్ని కేంద్రబిందువుగా చేసుకుని సిలబస్‌ను రూపొందించుకోవాలని అన్నారు. ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ దేశ్-ఇపోర్టల్ ద్వారా అన్ని భాషల్లోనూ స్కిల్ డెవలప్‌మెంట్ పాఠ్యాంశాలను చేర్చుతామని వివరించారు.


Click it and Unblock the Notifications