Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. మూడు గంటల్లోనే చెన్నైకి..
బెంగళూరు వాసులు శుభవార్త.. త్వరలోనే చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్ ప్రెస్ వేను దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే బెంగళూరు-చెన్నైకి చాలా త్వరగా చేరుకోవచ్చు. సాధారణంగా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు ఉంటుంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం పూర్తయితే కేవలం మూడు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ వే మూడు రాష్ట్రాల మధ్య రవాణాకు కీలకం కానుంది.
చెన్నై-బెంగళూరు మధ్య మొత్తం 258 కిలోమీటర్ల పొడవుతో కర్ణాటకలోని హోస్‌కోట నుంచి తమిళనాడులోని పెరంబూర్ వరకు ఈ జాతీయ ఎక్స్ ప్రెస్ వేను నిర్మిస్తున్నారు.
ఈ రహదారి, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడులను అత్యంత వేగవంతమైన మార్గంతో అనుసంధానించనున్నారు. ఈ జాతీయ ద్వారా కర్ణాటకలోని హోస్‌కోట, మాలూరు, బంగారుపేట, బేతమంగళ, కోలార్, నరసాపుర ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుకు కలుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె, పలమనేరు (మొగిలి) మీదుగా సుమారు 85 కిలోమీటర్ల మేర రహదారి అనుసంధానం చేయనున్నారు.

ఈ ఎక్స్ ప్రెస్ వే తమిళనాడులో రాణిపేట, అరక్కోణం, వాలాజాపేట, కాంచీపురం, శ్రీపెరంబదూర్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్లను కలుపుతుంది. దీంతో పరిశ్రమలు, ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.17 వేల కోట్లను మంజూరు చేసింది. ఇందులో సమారు రూ.5 వేల కోట్లు రహదారి కోర్ నిర్మాణ పనులకే వినియోగిస్తున్నారు. మిగిలిన నిధులను భూసేకరణ, పరిపాలన, టోల్ వ్యవస్థల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారికి సంబంధించి కర్ణాటకలో 71 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది.
పూర్తయిన రహదారిలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొగిలి ప్రాంతంలో కనెక్టివిటీ పనులు చేస్తున్నారు. పలమనేరు అటవీ ప్రాంతంలో అండర్‌పాస్‌ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఎక్స్ ప్రెస్ వేలో ఇప్పటికే దాదాపు 100 కిలోమీటర్ల మేర రహదారి పాక్షికంగా అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా సిగ్నల్-ఫ్రీ, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. రహదారిపై వాహనాల రాకపోకలను పర్యవేక్షించేందుకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎమ్ఎస్) ద్వారా ఏఐ ఆధారిత ట్రాఫిక్ మానిటరింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి పూర్తికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications