Bengaluru-Vijayawada: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విజయవాడ నుంచి బెంగళూరుకు 7 గంటల్లోనే..!
బెంగళూరు- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రహదారిలో భాగంగా ఏపీలోని పలు చోట్ల సొరంగాలు తవ్వుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కడప జిల్లాల్లో సొరంగాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని పోరుమామిళ్ల మండలం సీతారామపురం అటవీ సరిహద్దు ప్రాంతంలో 3.7 కి.మీ. సొరంగం పనులు చకచక పూర్తి చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద సొరంగంగా రికార్డు సృష్టించనుంది. ఆరు లేన్లు కావడంతో రెండు చొప్పున సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారు.
మరో సొరంగాన్ని కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దూదెన్నకోన సమీపంలో 179.290 కి.మీ వద్ద దాదాపు 750 మీటర్ల తవ్వుతున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఎడమ సొరంగం ద్వారా మూడు లేన్లు, కుడి సొరంగం ద్వారా మూడు లేన్ల రహదారి పనులు కొనసాగుతున్నాయి. కొండను తొలచడంతో పాటు మరోవైపు సిమెంట్ కాంక్రీట్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ రహదారి వల్ల బెంగళూరు-విజయవాడ మధ్య 100 కి.మీ. మేర దూరం తగ్గనుంది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే 12 గంటల ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం వల్ల రాయలసీమ రూపురేఖలు మారనున్నాయి.

విజయవాడ నుంచి 10 నుంచి 12 గంటలు సాగే ప్రయాణం కాస్తా ఐదారు గంటలకు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేని నిర్మిస్తున్నారు. బెంగళూరు - విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మొత్తం కొత్తగా నిర్మిస్తున్న రహదారి కాదు. బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌కు సమీపంలో గల కోడూరు వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెంగళూరు-హైదరాబాద్ హైవేలో 110 కిలోమీటర్లు మేర ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోడూరు నుంచి కొత్త రహదారి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేలోకి మారాల్సి ఉంటుంది. 343.24 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా రహదారి వరకు నిర్మిస్తారు. అక్కడి నుంచి విజయవాడకు 'చెన్నై-కోల్‌కతా' హైవేపై 115 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి దాదాపు 12 నుంచి 13 గంటల సమయం పడుతుందని.. గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తయితే 6 నుంచి 7 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా హైవే నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భారతమాల పరియోజన తొలి దశ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.14 వేల కోట్లు కాగా.. ఈ ఎకనమిక్ కారిడార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 140 కిలోమీటర్లు కాగా, సింగరాయకొండ నుంచి మైదుకూరు వైపు వెళ్లే 167బీ జాతీయ రహదారి వద్ద ఇంటర్ ఛేంజ్ నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా 5.31 కిలోమీటర్ల మేర ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications