తగ్గించలేదు.. యథాతథం: ఉద్యోగులకు EPFO భారీ ఊరట, ఆ తర్వాత వడ్డీ మొత్తం జమ
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.50 శాతంగా నిర్ణయించారు. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ(CBT) గురువారం శ్రీనగర్‌లో భేటీ అయింది. ఈ సమావేశంలో వడ్డీ రేటును ఖరారు చేశారు. ఈసారి వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ యథాతథ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు భారీ ఊరట కల్పించారు.
పీఎఫ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుందని, ఈ మేరకు రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (EPFO) అత్యున్నత నిర్ణాయక విభాగం CBT కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

భారీగా ఉపసంహరణ
కరోనా కారణంగా చాలామంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు తమ ఖాతాలోని నగదు ఉపసంహరించుకున్నారు. మరోవైపు డిపాజిట్లు తగ్గాయి. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు రూ.73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని అంచనా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింత పెరగవచ్చు. 2018-19లో రూ.81వేల కోట్ల పీఎఫ్ ఫండ్‌ను తీసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతకుమించి ఉంటుందని భావిస్తున్నారు. FY20లోను వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. ఇప్పుడు యథాతథంగా ఉంచింది. 2018-19లో అది 8.65 శాతంగా ఉంది.

మార్కెట్లో పెట్టుబడులు
ప్రస్తుతం EPFO ఆరు కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. డెట్ ఇన్వెస్ట్‌మెంట్ నుండి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుండి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని CBT తాజా నిర్ణయం తీసుకున్నది. 2015-16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రారంభించింది EPFO.
ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన EPFO పెట్టుబడులు ఇప్పుడు 15 శాతానికి చేరుకున్నాయి. 2018-19లో EPFO చందాదారులకు లభించిన వడ్డీ 8.65 శాతం. దీనిని 8.5 శాతానికి తగ్గిస్తూ గత ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలకు భిన్నంగా నిర్ణయం తీసుకొని, ఉద్యోగులకు ఊరట కల్పించారు.

ఆ తర్వాత జమ
ఈపీఎఫ్ వడ్డీ రేటుపై CBT నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు తెలియజేస్తారు. ఈ నిర్ణయాన్ని ఆర్థికశాఖ ఆమోదించిన అనంతరం ఉద్యోగ భవిష్య నిధి సబ్‌స్క్రైబర్స్ ఖాతాల్లో 8.50 శాతం వడ్డీని జమ చేస్తారు. కాగా, ఇటీవలి బడ్జెట్‌లో ఈపీఎఫ్ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వాటా ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను విధించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.


Click it and Unblock the Notifications