Hinduja Group: బ్రిటన్‌లోని అత్యంత ధనిక కుటుంబం హిందూజా కుటుంబంలో చీలికలు రాబోతున్నాయి. 108 ఏళ్ల హిందూజా గ్రూప్ ఆస్తుల విలువ 14 బిలియన్ డాలర్లు. సోదరుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. 86 ఏళ్ల శ్రీచంద్ హిందుజా తరఫు న్యాయవాదులు ఇటీవల లండన్ కోర్టులో మాట్లాడుతూ 2014 ఒప్పందాన్ని రద్దు చేసేందుకు కుటుంబం అంగీకరించిందని తెలిపారు. నవంబర్‌లో కుటుంబాల మధ్య విభజన జరగకపోతే, ఈ విషయం మరోసారి కోర్టుకు చేరుకుంటుంది. వీటిలో డజన్ల కొద్ది వ్యాపారాలు ఉండగా.. మన దేశంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా ఒకటి.

అసలు వివాదం..
2014 జులై 2న కుదిరిన ఒప్పందమే హిందూజా కుటుంబం మధ్య చిచ్చుకు మూలంగా ఉంది. కుటుంబానికి చెందిన ప్రతిదీ అందరికీ చెందినదే. 2014 ఒప్పందంపై వివాదం 2019 నుంచి కొనసాగుతోంది. బ్రిటన్ లోనే కాదు యూరప్ లోని పలు దేశాల్లో హిందూజా బ్రదర్స్ మధ్య న్యాయపోరాటం జరుగుతోంది. దీంతో కుటుంబానికి నష్టం వాటిల్లుతోంది. స్విట్జర్లాండ్‌లో ఉన్న SP హిందూజా బ్యాంక్ విషయంలో తలెత్తిన వివాదం వల్ల గొడవ మెుదలైంది. కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా ఈ బ్యాంకుపై తమ నియంత్రణను కోరుకున్నారు.

హిందూజా వ్యాపారాలు..
ట్రక్కుల తయారీ నుంచి బ్యాంకింగ్, కెమికల్స్, పవర్, మీడియా, హెల్త్‌కేర్ వరకు హిందూజా గ్రూప్ వ్యాపారాలు 1914 స్థాపించబడి విస్తరించారు. గ్రూప్ కంపెనీల్లో ఆటో మేజర్ అశోక్ లేలాండ్, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఉన్నాయి. మెుత్తం 14 బిలియన్ డాలర్ల సంపదతో హిందూజా ఫ్యామిలీ బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 38 దేశాల్లో.. 1.5 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు.

బ్యాంక్ బాధ్యతలు..
SP హిందూజా గ్రూప్ 2013లో Banca Commerciale Luganoని కొనుగోలు చేసి హిందూజా బ్యాంక్ (స్విట్జర్లాండ్)లో విలీనం చేసింది. తరువాత దాని పేరు మార్చబడింది. శ్రీచంద్ హిందుజా దీని వ్యవస్థాపక ఛైర్మన్ అయ్యారు. శ్రీచంద్ ఆరోగ్యం బాగోలేదని, దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అతని కుమార్తెలు ఆయన ఇష్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని అతని సోదరులు ఆరోపిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం శ్రీచంద్ హిందూజా డిమెన్షియాతో బాధపడుతున్నారు.

వేర్వేరు బాధ్యతలు..
హిందూజా గ్రూప్ లో ప్రతి సోదరుడికి వేర్వేరు వ్యాపార బాధ్యతలు ఉంటాయి. శ్రీచంద్ హిందూజా గ్రూప్ మొత్తానికి ఛైర్మన్. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌ల్లో ఒకటైన ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ను ప్రారంభించింది ఆయనే. ఈ బృందానికి గోపీచంద్ హిందూజా కో-ఛైర్మన్. హిందుజా ఆటోమోటివ్ లిమిటెడ్, UK ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. మూడవ సోదరుడు ప్రకాష్ ప్రస్తుతం యూరప్‌లోని హిందూజా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉండగా, అశోక్ భారతదేశంలోని హిందూజా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. శ్రీచంద్, గోపీచంద్ లండన్‌లో నివసిస్తున్నారు. ప్రకాష్ మొనాకోలో నివసిస్తున్నారు. అశోక్ భారత్ లో నివసిస్తున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ నెట్ వర్త్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో హిందూజా సోదరులు 110వ స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications