పాత కార్లు కొత్త ఇంధనంతో పోటీ పడగలవా? E20 వాడకంపై ప్రభుత్వం ఏమంటోంది?
ఇంధన ధరలు పెరుగుతున్నాయి మరియు పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త దిశలో అడుగులు వేసింది అదే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్. దీని వల్ల దేశానికి ఆర్థికంగా లాభం, పర్యావరణానికి ఉపశమనం. అయితే, కొత్తగా కార్లు కొనుగోలు చేసినవాళ్లు కాకుండా, ఒకటి రెండు సంవత్సరాల క్రితం వాహనాలు కొన్నవారు మాత్రం భయాందోళనలతో ఉన్నారు.

వాస్తవానికి ఇటీవల చాలా మంది వినియోగదారులు తమ వాహనాలకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజిన్ పనితీరు తక్కువ కావడం, మైలేజ్ తగ్గిపోవడం, మరమ్మత్తులకు భారీ ఖర్చులు రావడం వంటి సమస్యలు ఉంటాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమాన్ని (blended petrol) వాడటం వల్ల పాత వాహనాలకు పెద్దగా ఎలాంటి నష్టం జరగదు అని పరిశోధన సంస్థలు వెల్లడించాయి.
"ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటంవల్ల వాహనాలకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం తప్పుడు సమాచారంఅని అంటున్నారు. ఇది శాస్త్రీయంగా ఆధారితమైన, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ముందడుగు." అని కేంద్ర మంత్రిత్వశాఖ సోషల్ మీడియాలో తెలిపింది.
భారత్ ఇప్పటికే కచ్చితంగా 85% క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది. అలాంటి దేశానికి బయోఇంధనాలు వాడటం ద్వారానే దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు, కాలుష్యకరమైన వాయువులు తగ్గించవచ్చు అని పేర్కొంది.
2023 తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన కార్లలో చాలా వరకూ E20 (20% ఇథనాల్ మిశ్రమం) కు అనుకూలంగా డిజైన్ చేయబడ్డాయి. 2023కి ముందు ఉన్న పాత కార్లు ఈ కొత్త ఇథనాల్ పెట్రోలుకు తక్కువగా పనిచేయవచ్చని కొందరు అంటున్నారు.
ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణుడు మాట్లాడుతూ, "పాత వాహనాలలో ఇంజిన్‌లో తుప్పు ఏర్పడే అవకాశం, ముఖ్యంగా బైక్‌లకు ఇది మరింత ప్రమాదకరం" అని తెలిపారు. అంతేకాక, "ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ calorific value తక్కువగా ఉండటంతో ఇంజిన్‌కు తగిన పనితీరు అందించేందుకు ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. దీనివల్ల మైలేజ్ తగ్గిపోతుంది," అని అన్నారు.
E10 నుంచి E20కి మారిన కొత్త వాహనాల్లో మైలేజ్ లో కేవలం 1-2% తగ్గుదల మాత్రమే కనిపిస్తుంది. పాత వాహనాల్లో 3-6% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. కానీ ఇంజిన్ ట్యూనింగ్‌ను మెరుగుపరిచి, E20‑కోసం తయారైన పార్ట్స్ వాడితే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని SIAM (Society of Indian Automobile Manufacturers) తెలిపింది. 2023 ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన వాహనాలు ఎక్కువగా E20‑కంపాటబుల్ భాగాలతో ఉంటాయని కూడా స్పష్టం చేసింది.
ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), IIP (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం), మరియు IOCL R&D సంస్థలు కలిసి కొన్ని పరీక్షలు నిర్వహించాయి. వీటిలో పాత వాహనాలపై E20 ఇంధనం ఎలా పనిచేస్తుందో చూశారు. ఈ టెస్టుల ఫలితాల్లో పాత కార్లు కూడా ఈ కొత్త ఇంధనంతో సరిగా నడిచాయని తేలింది. పవర్, టార్క్, లేదా ఫ్యూయల్ ఖర్చులో పెద్దగా మార్పులు కనిపించలేదు. అంతేకాకుండా, ఇంజిన్ డ్యామేజ్ కాకుండా కార్లు వేడి గానీ, చల్లగా గానీ ప్రారంభం కావడంలో ఎలాంటి సమస్యలు చూపించలేదని వారు తెలిపారు.
2003లో మొదలైన ఈ ప్రోగ్రాం ప్రారంభంలో 5% బ్లెండింగ్ మాత్రమే లక్ష్యంగా పెట్టారు. కానీ 2014 వరకు సరైన ఇథనాల్ లభ్యత లేకపోవడంతో 1.5% మాత్రమే సాధ్యపడింది. తరువాత ఇథనాల్ కొనుగోలు ధరలు పెంచడం, వివిధ feedstocks వాడేందుకు అనుమతి ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవడంతో 2022 జూన్ నాటికి 10% మిశ్రమ సాధ్యమైంది.
ఇప్పుడు కేంద్రం 27% blending లక్ష్యాన్ని కూడా పరిశీలిస్తోంది. 2014-15 నుంచి ఇథనాల్ బ్లెండింగ్ వల్ల రూ. 1.4 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశారు. రైతులకు ఇథనాల్ కొనుగోలు ద్వారా రూ. 1.2 లక్షల కోట్ల చెల్లింపులు చేశారు. 700 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల నివారణ జరిగింది. చాలా మంది E20 కి తక్కువ ధర ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీని పై కేంద్రం ఇంకా వ్యాఖ్యానించలేదు.


Click it and Unblock the Notifications