India AI: ఇండియా నుంచి మొదటి AI యూనికార్న్.. చరిత్ర సృష్టించిన భవిష్ అగర్వాల్ కంపెనీ
AI Unicorn: ఓపైన్ AI తన ఆర్టిఫిషియల్ మోడల్ చాట్ జీపీటీని రిలీజ్ చేయడంతో ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు రియల్ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించింది. దీంతో దిగ్గజ సంస్థల నుంచి ఆయా స్టార్టప్స్ వరకు AI డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని విరివిగా ప్రారంభించాయి. వాటిలో ఒకటైన ఓలా గ్రూప్ ఇప్పుడు చరిత్ర సృష్టించింది.
మ్యాట్రిక్స్ పార్టనర్స్ నేతృత్వంలో ఓలా గ్రూప్‌కి చెందిన AI సంస్థ 'కృత్రిమ్'.. తాజా ఫండింగ్ రౌండ్‌లో 50 మిలియన్ డాలర్లను సేకరించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారత్ నుంచి ఆవిర్భవించిన మొదటి యూనికార్న్‌గా రికార్డు నెలకొల్పింది.

సేకరించిన నిధుల ద్వారా AI ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. కొత్త ఆవిష్కరణల దిశగా పనిచేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించడం తమ లక్ష్యాలుగా పేర్కొంది. అయితే కృత్రిమ్ తన బేస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్(LLM)ని గత నెలలోనే ఆవిష్కరించడం గమనార్హం.
'ఇండియా తన స్వంత AIని నిర్మించుకోవాలి. కృత్రిమ్ ద్వారా మొట్టమొదటి పూర్తి స్థాయి AI కంప్యూటింగ్ స్టాక్‌ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా మొదటి రౌండ్ నిధుల సేకరణను విజయవంతంగా ముగించినందుకు సంతోషిస్తున్నాము. వినూత్న AI సొల్యూషన్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచానికి కూడా అర్థవంతమైన సహకారాన్ని అందించగలమని నమ్ముతున్నాం' అని కంపెనీ వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ వివరించారు.
బెంగుళూరు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్తల బృందంచే LLM మోడల్ శిక్షణ పొందింది. అనేక భారతీయ భాషలను పూర్తిగా అర్థం చేసుకోగలగడంతో పాటు అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం కృత్రిమ్ AI సంభాషణ అసిస్టెంట్‌కి ఉన్నట్లు సమాచారం. జనవరి 2024 వరకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ అమలు చేస్తామని కంపెనీ గతనెలలోనే ప్రకటించింది. కాగా ఫిబ్రవరి నాటికి డెవలపర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications