Ola: రైడ్ షేరింగ్ సంస్థ ఓలా కొత్త బిజినెస్ లోకి ప్రవేశించింది. ఈ మేరకు కంపెనీ సహ వ్యవస్థాపకులు, CEO భవిష్ అగర్వాల్ X(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సర్వీసులు కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితమని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.
ఇకపై బైక్, కార్ రైడింగ్ సర్వీసులతో పాటు పార్శిల్స్ సైతం డెలివరీ చేసేందుకు ఓలా సిద్ధమైంది. ఇందుకోసం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తోంది. బెంగళూరులో ఈ సేవలను లాంచ్ చేయగా.. రుసుములను సైతం CEO భవిష్ తన X పోస్టులో పేర్కొన్నారు. 5 కిలోమీటర్ల దూరానికి 25, 10కి 50, 15కి 75, 20 కి.మీలకు 100 చొప్పున వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.

"ఈరోజు బెంగళూరులో ఓలా పార్శిల్‌ను ప్రారంభించాం! ఇండియాలో ఆల్-ఎలక్ట్రిక్ టూవీలర్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ మొదలైంది. ఈ రాత్రి నుంచే ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు, త్వరలో దేశమంతటా విస్తరిస్తాం" అని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ఇంట్రా-సిటీ పార్శిల్ డెలివరీ విభాగంలో ప్రస్తుతం పోర్టర్, స్విగ్గీ జెనీ, ఉబెర్, డన్జో వంటి ప్లేయర్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. కాగా ఇప్పుడు ఓలా కంప్లీట్ విద్యుత్ వాహనాలతో బరిలోకి దిగింది. ఇదేకాక ఫుడ్ డెలివరీ సేవలు అందించేందుకు గతనెలలో ONDCలో చేరింది. ఇటీవల తన బైక్ ట్యాక్సీ సేవలను బెంగళూరులో తిరిగి ప్రారంభించగా.. ఓలా ఎలక్ట్రిక్ S1 స్కూటర్లను మాత్రమే వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications